
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ప్రభాకర్ తన గెలుపు కోసం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో పర్యటించి కాలనీ సీనియర్ సిటిజన్లతో సమావేశాల్లో పాల్గొన్నారు. అపార్టుమెంట్లలో పర్యటించి తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వీధి నెంబర్ 8 లోని హైమావతి అపార్ట్‌మెంట్‌లో డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్‌తో కలిసి అపార్ట్మెంట్ వాసులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తనను మళ్లీ గెలిపిస్తే చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.