హుజూరాబాద్​లో ప్రచార జోరు

హుజూరాబాద్​లో ప్రచార జోరు
  • ఇంటింటికీ తిరుగుతున్న లీడర్లు
  • వచ్చే నెల మొదటివారంలో నోటిఫికేషన్​ 
  • వస్తుందనే అంచనాలతో పార్టీల అలర్ట్​
  • ప్రచారంలో ముందున్న బీజేపీ
  • వ్యూహాలు రచిస్తున్న మంత్రి హరీశ్ రావు
  • నేడు అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్​

కరీంనగర్ ​/ హైదరాబాద్​, వెలుగు: సెప్టెంబర్​ మొదటివారంలో హుజూరాబాద్​ఉప ఎన్నిక నోటిఫికేషన్​ వస్తుందనే అంచనాలతో అన్ని పార్టీలు అలర్టయ్యాయి. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్  ఇంటింటి ప్రచారం చేపడుతున్నాయి. సెగ్మెంట్​లోని గల్లీలన్నీ బీజేపీ, గులాబీ  జెండాలతో రెపరెపలాడుతుండగా.. మెడలో కండువాలతో కార్యకర్తలు కలియతిరుగుతున్నారు. సోమవారం తమ అభ్యర్థిని ప్రకటిస్తామని  కరీంనగర్​ పర్యటనలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్  చెప్పారు. జనం నాడి ఎలా ఉందో సర్వేల ద్వారా పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి.. ఎలా ముందుకు వెళ్లాలో ప్లాన్​ చేసుకుంటున్నాయి. 
గడప గడపకూ బీజేపీ
ఈటల రాజేందర్ ​తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన భార్య జమున, పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల పాదయాత్రకు మధ్యలో బ్రేక్​ పడినప్పటికీ జమున మాత్రం తన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్​పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొంటున్నారు. 

వీరు షెడ్యూల్​ ప్రకారం రోజూ ఒక గ్రామానికి వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. జమ్మికుంట మండలంలోని పోతిరెడ్డిపేటలో ఈటల జమున గడపగడపకూ ప్రచారంలో పాల్గొని, మహిళలకు బొట్టు పెట్టి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కమలాపూర్​, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో పర్యటించారు. హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో కరెంట్​ షాక్ తో మృతి చెందిన తూముల వేణు, ఇల్లందకుంట మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన కందాల తిరుపతిగౌడ్ అంత్యక్రియల్లో ఈటల రాజేందర్​ పాల్గొని, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇల్లంతకుంట మండలం చిన్నకోమటిపల్లిలో ఇటీవల మృతి చెందిన మూడెడ్ల ఐలయ్య, కందాల రాజయ్య కుటుంబాలను పరామర్శించారు. ఆయా మండలాలకు ఇన్​చార్జులుగా ఉన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్  రాథోడ్, ఎర్రబెల్లి సంపత్ రావు గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతులగూడెంలో రమేశ్​ రాథోడ్​, ఎర్రబెల్లి సంపత్ రావు, నిరూపరాణి, జీడి మల్లేశ్​  తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లోకల్ ​లీడర్లతో కలిసి వీణవంక మండలంలో ప్రచారం నిర్వహించారు.
24 క్లస్టర్లుగా విభజించుకున్న టీఆర్​ఎస్​
బీజేపీ ఇంటింటి ప్రచారానికి గ్రామాల్లో మంచి రెస్సాన్స్​ వస్తుండడంతో టీఆర్​ఎస్​ కూడా ఆదివారం నుంచి గడపగడప ప్రచారం ప్రారంభించింది. వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్​రావు ఆధ్వర్యంలో ఎంపీపీ రేణుక,  వైస్ ఎంపీపీ రాయ్ శెట్టి లత తదితరులు ఇల్లిల్లూ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అడిగారు. టీఆర్​ఎస్​జడ్పీ చైర్ పర్సన్​ కనుమల్ల విజయ ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో  ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. హుజూరాబాద్  వార్డుల్లో టీఆర్ఎస్  అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ దంపతులు, ఎస్సీ కార్పొరేషన్  చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్  రాధిక‍  తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలను 24 క్లస్టర్లుగా విభజించుకొని.. ఒక్కో క్లస్టర్ పరిధిలోకి నాలుగైదు గ్రామాలు వచ్చేలా, ఇన్​చార్జులను టీఆర్​ఎస్​ వేసింది. వీళ్లంతా ఆయా మండలాలకు ఇప్పటికే ఇన్​చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర లీడర్ల గైడెన్స్​లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. కింది స్థాయిలో క్యాడర్​ అవసరాలను తీర్చడంతో పాటు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేల  దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని వీళ్లకు ఆదేశాలు అందాయి. నాలుగైదు రోజుల్లో వార్డులవారీగా కూడా ఇన్​చార్జులను వేసి, ప్రచారం మొదలు పోలింగ్​బూత్​లకు ఓటర్లను తరలించే దాకా గ్రౌండ్​లెవల్​ బాధ్యతలు అప్పగిస్తామని టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. 
నియోజకవర్గంలో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డా
ఆర్థిక మంత్రి హరీశ్​రావు హుజూరాబాద్​లోనే అడ్డా వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత సైలెంట్​అయినప్పటికీ  మంత్రి హరీశ్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఈటల వెంట ఇప్పటికీ తిరుగుతున్న టీఆర్ఎస్ నాయకులెవరో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఏయే ఏరియాల్లో పార్టీ వీక్​గా  ఉందో, ఎక్కడ ఈటలకు ఎక్కువ  ప్లస్​ ఉందో అక్కడ ప్రధానంగా హరీశ్​ టార్గెట్​ చేస్తున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. కులాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ కులసంఘాల లీడర్లతో మంతనాలు సాగిస్తున్నారు. ఆదివారం హుజూరాబాద్​లోనే ఉన్న మంత్రి హరీశ్​రావు  టీఎన్​జీవోస్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంగన్​వాడీ ఉద్యోగుల కృతజ్ఞత సమావేశంలో, అటు పీఆర్టీయూ టీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయుల కృతజ్ఞత సమావేశంలో  పాల్గొన్నారు. ఈ రెండు సమావేశాల్లో.. 30శాతం పీఆర్సీ ఇచ్చిన  తమది ఎంప్లాయ్​ఫ్రెండ్లీ గవర్నమెంట్​ అని హరీశ్​ తెలిపారు. 

కేసీఆర్ సర్వేలు 
హుజూరాబాద్‌ ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడంపై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ఈటల రాజీనామా చేసిన నాటి నుంచి పలు ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్​ వర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా, కులాలు, ఏజ్‌ గ్రూపుల వారీగా ఎవరెవరు ఏ పార్టీకి అండగా నిలుస్తున్నారు.. అనే వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఆ డేటా ఆధారంగా ఎక్కడెక్కడ ఏమేం చేయాల్సి ఉందో ఎలక్షన్‌ ఇన్‌చార్జుల ద్వారా అమలు చేయిస్తున్నారు. 
దళిత బంధుకు రూ. 2 వేల కోట్లు విడుదల చేసిన తర్వాత పార్టీ గ్రాఫ్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా.. మిగతా కులాల రియాక్షన్​ ఎట్లుందనే వివరాలు తెలుసుకుంటున్నారు.