- గ్రామాలు, ఎన్నికలు జరగని ప్రాంతాల్లో నో కోడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో.. 17 రోజుల పాటు మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వపరమైన ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు.
ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాల ప్రకటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిగా నిలిచి పోనున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక వాహనాల్లో పర్యటించడం గానీ, మున్సిపాలిటీల్లో సమీక్షలు నిర్వహించడం గానీ నిషేధం. అయితే, ఈ కోడ్ గ్రామాలకు వర్తించదు. కేవలం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే పరిమితం కానుంది. కాగా, ఎన్నికల కోడ్ ఎప్పుడొస్తుందోనన్న ముందస్తు సమాచారంతో అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు.
కోడ్ అమల్లోకి వస్తే కొత్త పనులు మొదలుపెట్టలేమన్న ఆందోళనతో రాత్రి పగలు తేడా లేకుండా వరుసపెట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. నిధుల మంజూరుకు సంబంధించిన జీవోలను ఆగమేఘాల మీద జారీ చేయించుకుని, పనులు ప్రారంభించారు. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఈ హడావుడికి ఒక్కసారిగా తెరపడగా, ఇంకా ప్రారంభంకాని పనులన్నీ అటకెక్కే పరిస్థితి ఏర్పడింది.
అత్యవసర పనుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ
ఎన్నికల కోడ్ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పాలన పూర్తిగా స్తంభించిపోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అత్యవసర పనులకు సంబంధించిన నిర్ణయాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అత్యవసర విభాగాల్లో ఏదైనా సమస్య తలెత్తితే.. దానికి సంబంధించిన పనులు చేపట్టాలా? వద్దా? అన్నది ఈ కమిటీనే నిర్ణయిస్తుంది. ఏ పనులు చేపట్టాలన్నా ముందస్తుగా ఈ కమిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
సాధారణ అభివృద్ధి పనులను పక్కనపెట్టి, కేవలం ప్రజావసరాలకు అత్యంత కీలకమైన, ఆకస్మికంగా వచ్చే విపత్తులు లేదా సమస్యల పరిష్కారానికి మాత్రమే సీఎస్ కమిటీ ఆమోదం తెలపనుంది. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే ఏ నిర్ణయాన్నీ ఈ కమిటీ అనుమతించదు. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ఆటంకం లేకపోయినా, కొత్తగా టెండర్లు పిలవడం గానీ, కాంట్రాక్టులు ఖరారు చేయడం గానీ కుదరదు.
వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్ప, మిగిలిన ఏ పనులకూ మినహాయింపు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, కోడ్ అమలుతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది ఎన్నికల విధులపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది.
