జూబ్లీహిల్స్ బైపోల్‌.. అమల్లోకి ఎలక్షన్‌‌‌‌ కోడ్ .. తప్పుడు సమాచారం చేస్తే కఠిన చర్యలు: ఆర్వీ కర్ణన్

జూబ్లీహిల్స్ బైపోల్‌.. అమల్లోకి ఎలక్షన్‌‌‌‌ కోడ్ .. తప్పుడు సమాచారం చేస్తే కఠిన చర్యలు: ఆర్వీ కర్ణన్
  • ఈ నెల 11 వరకు కొత్త ఓటర్ల నమోదు
  • 80  ఏండ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం
  • సువిధ యాప్‌‌‌‌లో ర్యాలీలు, రాస్తారోకోలు, సభలకు అనుమతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్​ బైపోల్‌‌‌‌కు షెడ్యూల్​ విడుదల కావడంతో హైదరాబాద్‌‌‌‌లో ఎలక్షన్ ​కోడ్​అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. అందరూ మోడల్ కోడ్‌‌‌‌ ఆఫ్​ కండక్ట్‌‌‌‌ను పాటించాలని సూచించారు. సోమవారం ఆర్వీ  కర్ణన్‌‌‌‌ తన ఆఫీసులో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.  కోడ్ అమల్లోకి వచ్చినా కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని,  నామినేషన్ల గడువుకు10 రోజుల ముందు(ఈ నెల11)  వరకు ఓటరు నమోదుకు చాన్స్​ ఉన్నదని తెలిపారు.  ఈ నెల 13 నోటిఫికేషన్,  21 వరకు  నామినేషన్ల స్వీకరణ, 22న  స్క్రూటినీ ఉంటుందన్నారు.  వచ్చేనెల 11న పోలింగ్ ఉండగా, 14న కోట్ల విజయభాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ఉంటుందని వివరించారు. 80  ఏండ్లకు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం ఉన్నదని చెప్పారు. 

మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు

నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 139 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ బూత్‌‌‌‌లో 980 ఓటర్లకు మించకుండా ఉన్నారని తెలిపారు. సరిపడా ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్ లెవెల్ ఈవీఎం చెకింగ్ కూడా పూర్తయిందని వెల్లడించారు.  కంట్రోల్ యూనిట్స్ 826, బ్యాలెట్ యూనిట్స్ 1,494, వీవీ ప్యాట్స్‌‌‌‌ 837 సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నిక కోసం దాదాపు 5 వేల మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 

రాత్రి 10 గంటల వరకే ప్రచారం

ప్రతీ లిక్కర్ ఔట్‌‌‌‌లెట్స్ వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆర్వీ కర్ణన్‌‌‌‌ తెలిపారు.  హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 1950 ద్వారా ఓటరుకు సంబంధించిన ఫిర్యాదులు, ఓటు సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. సీ- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో అధికారులు స్పందిస్తారని చెప్పారు. పొలిటికల్ పార్టీలు ర్యాలీలు, రాస్తారోకోలు, సభలకు సువిధ పోర్టల్‌‌‌‌లో  అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం, లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఎన్నికకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ తప్పకుండా పాటించాలని, మీడియా కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. 

అభ్యర్థులు కేసుల వివరాలు చెప్పాలి

అభ్యర్థులు తప్పకుండా తమపై ఉన్న కేసుల వివరాలను న్యూస్ పేపర్లు, న్యూస్ చానెల్స్‎లో పబ్లిష్ చేయాలని సూచించారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువులు పంపిణీ చేసినట్టు ఓ ఎంపీ నుంచి ఫిర్యాదు వచ్చిందని, దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు.  ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు రూ.6 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు.  కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన ఐడీ కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.  

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు:సీపీ 


ఎలక్షన్​​కోడ్ అమల్లోకి  వచ్చిన నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని  సీపీ  వీసీ సజ్జనార్ హెచ్చరించారు.  ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేశాయని,  సర్వేలెన్స్​ బృందాలు ఉంటాయన్నారు. నోడల్ అధికారిగా తఫ్సీర్ ఇక్బాల్ ఉంటారని,  బైండోవర్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సమావేశంలో  జీహెచ్ఎంసీ ఎన్నికల అడిషనల్ కమిషనర్ హేమంత్ పాటిల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం,  తదితరులు పాల్గొన్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు

మొత్తం             3,98,982 
పురుషులు        2,07,367  
మహిళలు        1,91,590 
ఇతరులు        25


సెక్టార్‌‌‌‌ అధికారుల పాత్ర కీలకం


ఎన్నికల ప్రక్రియలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ లుగా  సెక్టార్‌‌‌‌ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించిన సెక్టార్‌‌‌‌ అధికారులకు సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో శిక్షణ  ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక తహసీల్దార్లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ అధికారుల సహకారంతో వల్నరబుల్ మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. అనంతరం నోడ్ అధికారులతోనూ మీటింగ్​ నిర్వహించారు. అనంతరం నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డీఆర్సీ సెంటర్, స్ట్రాంగ్ రూంను  ఆర్వీ కర్ణన్​ పరిశీలించారు.