తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే
  • పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ
  • చీఫ్ గెస్ట్​గా హాజరు కానున్న సోనియా గాంధీ
  • ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ ప్రకటనలు, స్పీచ్​లు చేయొద్దని కండీషన్ పెట్టింది. ఈ మేరకు జూన్‌‌ 2న సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రాజ్యసభ ఎంపీ హోదాలో వేడుకలకు చీఫ్ గెస్ట్​గా పిలవాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే తీర్మానం చేసింది. 


సోనియా గాంధీని ఇన్వైట్ చేసేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్​లో సమావేశమై రివ్యూ నిర్వహించారు. సీఈసీ అనుమతివ్వడంతో అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు

సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్​పార్క్​ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్లేస్​తో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్​ను సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఎండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట షామియానాలు వేయించాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు సూచించారు. 

సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌలత్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలు పెట్టాలని జీహెచ్​ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు చేయించాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా త్రీ ఫేజ్ కరెంట్ సప్లై చేయించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్, సెక్రటరీలు క్రిస్టినా జోంగ్తు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ  సుదర్శన్ రెడ్డి, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.