కాళేశ్వరంపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్​పై సీబీఐ విచారణ జరిపించాలన్న కాంగ్రెస్​ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్​ స్పందించింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ చీఫ్​ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆ ఉత్తర్వులను చీఫ్​ సెక్రటరీ(సీఎస్​)కు సీఈవో వికాస్​ రాజ్​ పంపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం వంటి ఘటనలపై ఈ నెల 3వ తేదీన ఈసీకి కాంగ్రెస్​ పార్టీ లేఖ రాసింది. 

ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సీఈవో వికాస్​రాజ్​ను కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీన ‘మోస్ట్​ ఇమీడియట్​’ అని పేర్కొంటూ సీఎస్​కు సీఈవో ఉత్తర్వులను జారీ చేశారు. ఏం చర్యలు తీసుకుంటున్నారో ఫిర్యాదుదారుకు తెలియజేయాలని అందులో సూచించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.