ఎన్నికల వేళ ఈసీ స్పెషల్ డ్రైవ్..  రూ.651 కోట్లు స్వాధీనం

ఎన్నికల వేళ ఈసీ స్పెషల్ డ్రైవ్..  రూ.651 కోట్లు స్వాధీనం

న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాలు, బై పోల్స్ జరుగనున్న ఆరు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిఘాను ముమ్మరం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆదివారం వరకు రూ. 651.51 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.  రూ.230 కోట్ల డ్రగ్స్, మత్తు పదార్థాలు, రూ.231 కోట్ల ఉచిత కానుకలు, రూ.79 కోట్ల విలువైన 30 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఎన్నికల అక్రమాలను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. రాష్ట్రాలు,  యూటీల్లో 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించింది. ఫిర్యాదు అందిన 100నిమిషాల్లోనే పరిష్కరించేలా వీరికి బాధ్యతలు అప్పగించింది.

ఆకస్మిక తనిఖీల కోసం మరో 5,200కుపైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా రూ.319 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. ఇందులో రూ.150 కోట్ల విలువైన ఉచిత కానుకలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో  రూ.170 కోట్లతో తమిళనాడు నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో నగదు కంటే డ్రగ్స్, ఉచిత కానుకల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే రాజకీయ పార్టీల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.