- కొలిక్కి వచ్చిన బీఆర్‌ఎస్ ఎంపీ క్యాండిడేట్లు
- నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారిక ప్రకటన
- నల్గొండకు తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి
- భువనగిరికి క్యామ మల్లేశ్, బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్ల పరిశీలన
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ రెండు స్థానాల కోసం నలుగురి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసింది. వీరితో పాటు, మరో నలుగురు సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో సామాజిక, ఆర్థిక అంశాలే కీలకంగా మారడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీకి ధీటైన క్యాండిడేట్లను రంగంలోకి దింపాలని బీఆర్‌ఎస్ భావించింది. దీంతో నల్గొండ టికెట్ రెడ్లకు, భువనగిరి స్థానం బీసీలకు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు క్యాండిడేట్ల ఎంపిక పూర్తయినట్లు తెలిసింది.
ఫైనల్ లిస్ట్‌లో నలుగురి పేర్లు
పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిన ఫైనల్ లిస్ట్‌లో నల్గొండ ఎంపీ క్యాండిడేట్లుగా మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భువనగిరి నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, రంగారెడ్డి జిల్లా నేత క్యామ మల్లేశ్ పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. చిన్నప్పరెడ్డి లోకల్‌బాడీ ఎమ్మెల్సీ బైపోల్‌లో గెలిచారు. ఆ తర్వాత మరోసారి జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్ దక్కింది.
తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ టికెట్ కోసం ప్రయత్నించారు. అలాగే కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ సిట్టింగ్‌లకే మరోసారి ఛాన్స్ ఇవ్వడంతో వీరికి అవకాశం దక్కలేదు. ఇక భువనగిరి సీటు బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. భువనగిరి, మునుగోడు, జనగామ, ఆలేరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కురుమ, గౌడ సామాజికవర్గం ఓట్లు బలంగా ఉన్నాయి.
దీంతో కురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశం పేరును పార్టీ పరిశీలనలోకి తీసుకుంది. భిక్షమయ్యగౌడ్ బీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి పదవుల విషయంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఎంపీ అనేది రాజకీయంగా ఆయనకు చివరి అవకాశంగానే భావిస్తున్నారు.
ఆశావహుల్లో మరికొందరు
నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్‌ను మరికొందరు సైతం ఆశిస్తున్నారు. డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్, సుంకరి మల్లేశ్‌గౌడ్, కడారి అంజయ్య యాదవ్, దేవరకొండకు చెందిన కిషన్ నాయక్ సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి, కురుమ సామాజిక వర్గాలకే ఛాన్స్ దక్కొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
