- ఎన్నికల పరిశీలకులు బాల మాయదేవి
గ్రేటర్ వరంగల్/ వర్ధన్నపేట/ పర్వతగిరి/ రాయపర్తి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆమె కలెక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్ తో కలసి ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నోడల్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతిక నైపుణ్యాన్నీ ఉపయోగించుకొని పనిచేయాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
వ్యయ పరిశీలకులు సునయన చౌహాన్ కు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సత్య శారద జిల్లాలో మూడు దశల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పూర్తి వివరాలు అందించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన టీ పోల్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని కలెక్టర్ సత్య శారద తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..
జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాల మాయదేవి, కలెక్టర్ సత్యశారద, వ్యయ పరిశీలకులు సునయన చౌహాన్వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, కట్ర్యాల క్లస్టర్లు, పర్వతగిరితోపాటు పలు గ్రామాలు, రాయపర్తి మండల కేంద్రం రాగన్నగూడెం గ్రామాల్లో కొనసాగిన నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, మెడికల్ క్యాంప్‌ల్లో రిటర్నింగ్ అధికారుల పనితీరుపై ఆరా తీశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాల్లు లేకుండా చూడాలన్నారు.
