
ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు మేయర్ ఎన్నిక జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ మేయర్ పదవికి పోటీ పడుతోంది. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
మరోవైపు.. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతుండగా.. బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్ ఉండగా.. బీజేపీ నుంచి కమల్ బార్గీ పోటీ పడుతున్నారు. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయం తెలిసిందే.
250 స్థానాలు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని ముందుగా బీజేపీ ప్రకటించింది. అయితే..గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ బీజేపీ పోటీలోకి దిగింది.
ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లలో ఏడాదికి ఒకసారి మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.