ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
  •     నల్గొండ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన 

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 18న లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు నామినేషన్ల స్వీకరణ  ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.  మంగళవారం కలెక్టరేట్​లో ఎస్పీ చందనాదీప్తితో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల18 నుంచి 25 వరకు నల్గొండ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు ఫామ్–2 ఏలో  అన్ని వివరాలు పూరించి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు.

ఒక అభ్యర్థి నాలుగు సెట్ల వరకు గరిష్టంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.25 వేలు డిపాజిట్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ తోపాటు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. నామినేషన్ తోపాటు ఫామ్-–26 ద్వారా ఆఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. అఫిడవిట్​లో విద్యార్హతలు, కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపర్చాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ  సందర్భంగా 100 మీటర్ల పరిధిలో ఇతరులకు అనుమతి ఉండదని

 అభ్యర్థితోపాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో రూ.9.18 కోట్ల విలువైన నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామన్నారు. వాడపల్లి, నాగార్జునసాగర్, అడవిదేవులపల్లిలో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, మీడియా నోడల్ అధికారి, పరిశ్రమలశాఖ జీఎం కోటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు సిద్ధం

నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్-, ఖమ్మం, -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా  యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయం నుంచి వరంగల్, -ఖమ్మం-,  నల్గొండ జిల్లాల కలెక్టర్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది

బ్యాలెట్ బాక్స్ ల వివరాలను తక్షణమే సమర్పించాలని కోరారు. పార్లమెంట్​ ఎన్నికల్లో నోడల్ అధికారులుగా వ్యవహరించిన వారినే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నియమించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రూట్లు, రూట్ మ్యాప్ లు తయారు చేయాలని, అవసరమైన పోలింగ్ సామగ్రి, వాహనాలు విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.