- ఎన్నికల అధికారి రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రెండు, మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు సోమవారం పట్టణంలోని జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సూచనలు చేశారు.
ఎన్నికల నిర్వహణలో స్టేజి -2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. రెండో విడతలోని ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్, మూడో విడతలోని బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పర్యవేక్షించాలని సూచించారు.
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ చేపట్టి ఫలితాలు టీ -పోల్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్, ఇతర సంబంధిత అంశాలను పర్యవేక్షించాలని సూచించారు. అడిషనల్కలెక్టర్రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల సామగ్రి, పోస్టల్ ఎన్నికలను పరిశీలించిన కలెక్టర్
ఇంద్రవెల్లి, వెలుగు: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా కోరారు. సోమవారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ సహాయ కేంద్రాలు, పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సహాయ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను, ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల జూనియర్ కాలేజీ వద్ద పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఐడీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల ఎంపీడీవోలు రాంప్రసాద్, జీవన్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

