మల్కాజ్ గిరిలో 24, నిజామాబాద్‌‌లో 18 టేబుళ్లు

మల్కాజ్ గిరిలో 24, నిజామాబాద్‌‌లో 18 టేబుళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​లో భాగంగా మల్కాజిగిరిలో 24 టేబుళ్లు, నిజామాబాద్‌‌లో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఈవో రజత్‌‌ కుమార్‌‌ తెలిపారు. మల్కాజిగిరిలో దేశంలోనే అత్యధిక మంది ఓటర్లు ఉండగా, నిజామాబాద్‌‌లో దేశంలోనే ఎక్కువగా 185 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈనేపథ్యంలో ఈ రెండు స్థానాల ఓట్ల లెక్కింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. ఈనెల 23న జరగనున్న కౌంటింగ్‌‌పై రిటర్నింగ్‌‌ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్‌‌ రిటర్నింగ్‌‌ అధికారుల (ఏఆర్వోలు)కు గురువారం హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌‌ ప్రారంభించాలని సూచించారు. మొదట పోస్టల్‌‌ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కించాలని, ర్యాండమ్‌‌గా ఐదు వీవీపాట్లను లెక్కించాలన్నారు. కౌంటింగ్‌‌ ఏజెంట్లతో ఎలా వ్యవహరించాలో వివరించారు. వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు, పరిశీలకుల సంతకాలకున్న ప్రాముఖ్యం తదితరాలను గురించి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళిని వివరించారు. శిక్షణ శిబిరంలో కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్‌‌, మాజీ సీఈవో బన్వర్‌‌లాల్‌‌, డిప్యూటీ సీఈవో జ్యోతి బుద్ధప్రసాద్, జాయింట్‌‌ సీఈవో ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.