
ట్యాంక్ బండ్, వెలుగు: కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తూ, బీజేపీ సిద్ధాంతాలను అమలుచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ ఇన్చార్జి ప్రియాంక కక్కర్ ఆరోపించారు. ఆదివారం లిబర్టీలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.
పరిపాలన చేయలేక ఖజానా లేదంటూ రేవంత్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఉచిత విద్యుత్ అంటూనే కోతలు విధిస్తూ ఇన్వర్టర్ కంపెనీలకు వ్యాపారం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటే.. మరోవైపు రేవంత్రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, బుర్ర రాములుగౌడ్, విజయ్ మల్లంగి తదితరులు పాల్గొన్నారు.