నల్లగొండ: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో ప్రత్యక్షమైన ఘటనలో నల్లగొండ కలెక్టర్ సీరియస్ అయ్యారు. చిట్యాల మండలం చిన్న కాపర్తిలో సర్పంచ్ ఓట్ల పోలింగ్ స్లిప్స్ డ్రైనేజీలో కనిపించడంతో ఎలక్షన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవోతో పాటు పోలింగ్ ఆఫీసర్స్ పై సస్పెన్షన్ వేటుపడింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన పదిమంది పీవోలతోపాటుచిట్యాల ఎంపీడీవో జయలక్ష్మీని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
మొదటి విడత ఎన్నికల పోలింగ్ సందర్బంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి లో డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు కలకలం రేపింది. గ్రామ డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు ప్రత్యక్ష్యం కావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. బ్యాలెట్ పేపర్లలో బీఆర్ ఎస్ బలపర్చిన కత్తెర గుర్తు చెందిన ఓట్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఎన్నికల సహాయ అధికారిని సంప్రదించి విషయం తెలిపారు. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల తర్వాత బ్యాలెట్ పేపర్లు బయటికి రావడం పలు అనుమానాలను రేపింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. చిట్యాల ఎంపీడీవోతోపాటు ఆర్వో, పదిమంది పీవోలను సస్పెండ్ చేశారు.

