
మహబూబ్ నగర్, వెలుగు: పాలమూరు జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆక్రోశంతో అధికార పార్టీకి చెందిన నాయకులు చేసిన దాడిలో ఓ బీజేపీ కార్యకర్త, మరో మహిళ చనిపోయారు. మహబూబ్‍నగర్ మండలం రాంచంద్రపురం గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍పై రెబల్ అభ్యర్థి వెంకటయ్య విజయం సాధించారు. మంగళవారం రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సంబరాలు జరుపుకొంటుండగా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కుమారుడు కుర్వశ్రీను తమ పార్టీకి ఓటేయలేదని ద్విచక్రవాహనంపై వెళ్లి జులుస్‍ను అడ్డుకున్నాడు. అంతటితో ఆగక అడ్డువచ్చిన ఓ యువకుడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని తెలిసి తన భర్తను తీసుకుని రావడానికి వెళ్లిన అనసూయ(40)పై ద్విచక్ర వాహనం పోనివ్వడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి ఘటనా స్థలాన్ని సందర్శించారు. గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో మంత్రి శ్రీనివాస్‍గౌడ్ గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. దాడికి పాల్పడ్డవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఓడిపోయామనే కక్షతో..
దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి యజ్ఞభూపాల్‍రెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలైన టీఆర్‍ఎస్ అభ్యర్థి రామకృష్ణారెడ్డి కొడుకు పడమటి శ్రీకాంత్‍రెడ్డి మంగళవారం అర్ధరాత్రి ఇనుపరాడ్‍లతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‍కుమార్ (28) అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన వారిని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. టీఆర్‌ఎస్ నాయకులు తమ కార్యకర్తను దారుణంగా హతమార్చారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ, జితేందర్‍రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కేసీఆర్‌వి హత్యా రాజకీయాలు: ఎంపీ సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నందున కేసీఆర్ భయపడి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, పినరయి విజయన్‌ల మాదిరి హత్యా రాజకీయాలకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు. నారాయణపేట జిల్లా దేవరకద్రలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్‌కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. హత్యపై దర్యాప్తు జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరో బెంగాల్ చేస్తున్నరు: రాజాసింగ్
పరిషత్ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రాన్ని పశ్చిమబెంగాల్‌లా సీఎం కేసీఆర్ మార్చేస్తున్నారని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ్ ర్యాలీపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని, బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్(23) ను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ వేగంగా బలపడటాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు.