
- నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై ‘ఇంటిగ్రిటీ ఫీజు’
- రూ.21 వేలు వసూలు చేసేందుకు నిర్ణయం
- 2026 నుంచి అమల్లోకి కొత్త రూల్
- ప్రత్యేక సందర్భాల్లోనే రీఫండ్ చేసే అవకాశం
- స్టూడెంట్, టూరిస్ట్, హెచ్1బీ వీసాలపై ఆర్థిక భారం
- సీపీఐ, ఇన్ఫ్లేషన్ ఆధారంగా ప్రతీ ఏడాది ఫీజు సవరణ
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలైన స్టూడెంట్ (ఎఫ్1, జే1), టూరిస్ట్ (బీ1/బీ2), హెచ్1బీ వీసాలపై సుమారు రూ.21వేల ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ విధిస్తున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ ఇమ్మిగ్రేషన్ సంస్కరణల్లో భాగంగా ఈ ఫీజు తీసుకొచ్చింది. 2026 నుంచి ఇది అమల్లోకి రానున్నది. ఇండియన్ స్టూడెంట్లు, టూరిస్టులు, హెచ్1బీ వీసా హోల్డర్ల అప్లికెంట్లపై ఈ ఫీజు కొంత ప్రభావం చూపుతుంది. ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ అయిన ఫ్రాగోమెన్ నివేదిక ప్రకారం.. ప్రతి ఏటా వీసా ఇంటిగ్రిటీ ఫీజు పెంచుకునేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కి ట్రంప్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం కానీ, రద్దు చేయడం కానీ ఉండదు. డిప్లొమాటిక్ వీసాలు (ఏ, జీ), కొన్ని ఇతర ప్రత్యేక వీసాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. హెచ్4 వంటి డిపెండెంట్ వీసాలకు ఈ ఫీజు వర్తిస్తుందా, లేదా అనేదానిపై స్పష్టత లేదు.
కొన్ని షరతులతో ఫీజు రీఫండ్!
వీసా ఇంటిగ్రిటీ ఫీజును కొన్ని షరతులతో రీ ఫండ్ చేస్తారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న టైమ్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే.. ఈ ఫీజు రీఫండ్ చేసే అవకాశం ఉంది. ఐ-94 గడువు ముగియడానికి 5 రోజుల కన్నా ముందుగానే అమెరికాను విడిచి వెళ్లేవారికి, ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగింపు, శాశ్వత నివాస అనుమతి పొందినవారికి ఫీజును తిరిగి చెల్లించొచ్చు. బీ1/బీ2 వీసా హోల్డర్లు తమ వీసా అప్లికేషన్ (డీఎస్ 160 ఫామ్)లో పేర్కొన్న విధంగా నడుచుకోకపోతే మాత్రం రీఫండ్ రాదు.
బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ఇప్పుడు సుమారు రూ.15 వేలు ఉంటే.. దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద రూ.21 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చు సుమారు రూ.35 వేల వరకు ఉండనున్నది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు వీసా దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ ఫీజు తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా, ఈ ఫీజు ద్వారా అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని యోచిస్తున్నది. ఇది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఖర్చులు భరించడానికి ఉపయోగపడుతుంది.
స్టూడెంట్లపై ఆర్థిక భారం
ఇప్పటికే అధిక ట్యూషన్ ఫీజులతో ఇబ్బంది పడుతున్న స్టూడెంట్లకు ఈ ఫీజు అదనపు భారంగా మారనున్నది. అమెరికాలో ఉన్న తమ పిల్లలను లేదా బంధువులను చూసేందుకు వెళ్లే ఇండియన్లకు ఈ ఫీజు పెద్ద ఆర్థిక భారం. బీ2 వీసా ఖర్చు దాదాపు రెట్టింపు కావడంతో పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 2025లో హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850 నుంచి ఏకంగా సుమారు రూ.21వేలకు పెరిగింది. ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల 2026 కోసం హెచ్1బీ దరఖాస్తుల సంఖ్య చాలా తగ్గింది. వీసా అప్లికెంట్ల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్క్రీన్ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్టూడెంట్ వీసా నిబంధనలను మరింత కఠినం చేసింది.