హైదరాబాద్ లో ఏటీఎం కట్చేసి.. 34 లక్షలు చోరీ

 హైదరాబాద్ లో ఏటీఎం కట్చేసి.. 34 లక్షలు చోరీ

 

  • పోలీసులు కార్డెన్ ​సెర్చ్​నిర్వహించిన కొన్ని గంటల్లోనే చోరీ
  •  హైదరాబాద్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: గ్యాస్​ కట్టర్​తో ఏటీఎం కట్ ​చేసి, రూ.34 లక్షలు చోరీ చేశారు.. నలుగురు దుండగులు ఈ పని చేసినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. పోలీసులు కార్డెన్​సెర్చ్​ నిర్వహించిన కొన్ని గంటలకే ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. డీసీపీ సురేశ్​కుమార్​తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల మార్కేండేయ నగర్​లో బాలానగర్​ ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు  ఇన్​స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 40 మంది కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి కార్డెన్ సెర్చ్​ నిర్వహించారు. 

నంబర్​ప్లేట్​లేని, చలాన్లు పెండింగ్​ఉన్న వాహనాలను సీజ్​చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను తనిఖీ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే(బుధవారం తెల్లవారుజామున 2.45 నుంచి 3.25 గంటల మధ్యలో) స్థానిక హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం వద్దకు రెండు బైక్​లపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగు ధరించి, వచ్చారు. లోపలికి వెళ్లి, గ్యాస్​కట్టర్​తో ఏటీఎంను కట్ చేశారు. అనంతరం  క్యాష్​డిపాజిట్ ట్రేతో సహా రూ.34 లక్షలను ఎత్తుకెళ్లారు. ముంబయిలో అలారం మోగడంతో అక్కడి అధికారులు 3.27 గంటలకు ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

10 నిమిషాల్లోనే వారు  సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్​స్క్వాడ్ ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయింది. కాగా, చోరీకి ఉపయోగించిన గ్యాస్​ కట్టర్, వేసుకున్న దుస్తులు, ఖాళీ క్యాష్ ట్రేను నిందితులు జీడిమెట్ల డిపో వద్ద నాలాలో పడేసి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందని, కొన్ని క్లూస్​ దొరికాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీసీ పేర్కొన్నారు.