కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాల్సిందే .. జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా హైదరాబాద్ లో ధర్నాలు, ర్యాలీలు

కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాల్సిందే .. జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా హైదరాబాద్ లో ధర్నాలు, ర్యాలీలు
  • నెలకు రూ.26 వేలు జీతం ఇవ్వాలె
  • 10 గంటలు పని చేసేది లేదు 
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలె
  • లేకపోతే ఆందోళనలు ఉధృతం 
  • కార్మిక సంఘాల ప్రకటన  

హైదరాబాద్ సిటీ, వెలుగు : కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందేనని బుధవారం నగరంలో కార్మిక సంఘాలు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించాయి. నాలుగు లేబర్​కోడ్​లను రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. బల్దియా హెడ్డాఫీసు ఎదుట సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరగ్గా, సీఐటీయూ నేషనల్​ట్రెజరర్​ఎం సాయిబాబా మాట్లాడారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లకు, నెలకు రూ.26 వేల కనీసం వేతనం ఇవ్వాల్సిందేనన్నారు. 

పనిగంటలను పన్నెండు గంటలు చేసిందని, దీంతో కర్నాటక, ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వాలు పనిగంటలు పెంచుతూ జీవోలు కూడా ఇచ్చాయన్నారు. వెంటనే పెంచిన పనిగంటలను రద్దు చేయాలన్నారు.  ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కేంద్ర బీజేపీ సర్కారు కాలరాస్తోందన్నారు.  

శంషాబాద్ లో ర్యాలీ..

శంషాబాద్: శంషాబాద్​లో వివిధ రంగాల కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తర్వాత బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ కార్మిక వర్గ ప్రయోజనాలకు నష్టం కలిగించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీతభత్యాలు పెంచకుండా, వారి మౌలిక వసతులును మెరుగుపరచకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. దేశంలో కొనుగోలు శక్తి రోజు రోజుకూ తగ్గిపోతున్నదన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. యాదగిరి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నెపు ప్రభు, రాజేంద్రనగర్ సీపీఐ మండల కార్యదర్శి కన్య నరసింహారెడ్డి పాల్గొన్నారు.

చందానగర్​లో..

చందానగర్ : సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూసీటీ సంఘాల ఆధ్వర్యంలో చందానగర్ మున్సిపల్ ఆఫీసు అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల లీడర్లు కృష్ణ, శివాని, చందు, రాములు, మురళి, దశరథ్ నాయక్, నాగమణి, శ్రీలత, నీరజ, నిర్మల మాట్లాడుతూ ఒకవైపు ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంటే కేంద్రం కార్పొరేట్ కంపెనీల కోసం చట్టాలను మారుస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల విధానానికి మద్దతుగా 282జీవో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.