బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈ సారి తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఒక పాన్ మసాలా కు సంబంధించిన ప్రకటన విషయంలో కోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సివచ్చింది. సల్మాన్ ప్రచారం చేసిన ప్రకటన తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆరోపిస్తూ.. రాజస్థాన్ లోని కోట వినియోగదారుల కోర్టులో ఆయనపై ఫిర్యాదు దాఖలైంది. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు.. సల్మాన్ ఖాన్ తో పాటు పాన్ మసాలా తయారీ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
'కేసర్'పైనే అనుమానాలు
సల్మాన్ ఖాన్ పై ఈ ఫిర్యాదును బీజేపీ సీనియర్ నాయకులు, రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది అయిన ఇందర్ మోహన్ సింగ్ హనీ దాఖలు చేశారు. ముఖ్యంగా రాజశ్రీ పాన్ మసాలా ప్రకటనల్లో 'కుంకుమపువ్వు కలిపిన యాలకులు', ' కేసర్ కలిపిన పాన్ మసాలా' వంటి వాటిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసర్ ధర కిలోకు దాదాపు రూ.4 లక్షలు ఉన్నప్పుడు, కేవలం రూ. 5 కే విక్రయించబడే పాన్ మసాలా ప్యాకెట్‌లో నిజంగా కేసర్ ఉండటం అసాధ్యం. ఈ ప్రకటనల ద్వారా కంపెనీ , సల్మాన్ ఖాన్ ఇద్దరూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అడ్వకేట్ హనీ వాదన. ఇది నిజంగా ప్రజలను భ్రమ కలిగించే ప్రకటన అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా యువత తప్పుదారి పట్టే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
క్యాన్సర్ ముప్పుపై ఆందోళన
అంతేకాకుండా ఈ అంశంపై న్యాయవాది ఇందర్ మోహన్ సింగ్ హనీ ఒక కీలకమైన సామాజిక కోణాన్ని లేవనెత్తారు. బాలీవుడ్ నటులు యువతకు రోల్ మోడల్స్ అని, అలాంటివారు పాన్ మసాలా వంటి ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 'సల్మాన్ ఖాన్ వంటి సెలబ్రిటీలు యువతను దీనిని వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. పాన్ మసాలా నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి అని అందరికీ తెలిసిన విషయమే. విదేశాల్లోని తారలు కూల్‌డ్రింక్స్‌ను కూడా ప్రచారం చేయడానికి వెనుకాడతారు. కానీ మన దేశంలో మాత్రం టొబాకో, పాన్ మసాలాలను ప్రచారం చేస్తున్నారు. యువతకు తప్పుడు సందేశం ఇవ్వవద్దని నేను వారిని కోరుతున్నాను హానీ తెలిపారు.
తదుపరి చర్యలు
న్యాయవాది ఇందర్ మోహన్ సింగ్ హనీ ఫిర్యాదును కోట కన్స్యూమర్ కోర్ట్ చాలా సీరియస్‌గా తీసుకుంది. పాన్ మసాలా ప్రకటనలపై తక్షణమే నిషేధం విధించాలని, తప్పుడు సమాచారంతో కూడిన ప్రకటనలను నియంత్రించాలని ఫిర్యాదుదారు కోరారు. అయితే ప్రస్తుతానికి, సల్మాన్ ఖాన్ లేదా రాజశ్రీ పాన్ మసాలా ప్రతినిధుల నుండి ఎటువంటి ప్రజా ప్రకటన విడుదల కాలేదు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 27, 2025 వరకు వాయిదా వేదసింది. ఒక సెలబ్రిటీ సమాజం పట్ల ఎంత బాధ్యత వహించాలి అనే చర్చకు ఈ కేసు మరింత బలం చేకూర్చింది.
