చిన్నగుండవెల్లిలో అభివృద్ధి, పథకాలు భేష్..మధ్యప్రదేశ్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల ప్రశంస

చిన్నగుండవెల్లిలో అభివృద్ధి, పథకాలు భేష్..మధ్యప్రదేశ్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల ప్రశంస

సిద్దిపేట రూరల్, వెలుగు: చిన్నగుండవెల్లి పంచాయతీలో అభివృద్ధి, పథకాల నిర్వహణ బాగుందని మధ్యప్రదేశ్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ప్రశంసించారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి పంచాయతీని సందర్శించారు. గ్రామంలోని అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ, డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సిమెంట్ రోడ్లు, కాల్వలు వంటి పనులు పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొక్కల పెంపకం బాగుందని, భవిష్యత్ లో  తమ రాష్ట్రంలోనూ అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

  మధ్యప్రదేశ్ కు చెందిన 27 ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతూ.. ఇందులో భాగంగా గ్రామాన్ని సందర్శించారు.  వారి వెంట డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీవో ఎం. మురళిధర శర్మ, ఎంపీవోలు శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి, నేతలు మహిపాల్ రెడ్డి, పద్మారెడ్డి, మాధవ రెడ్డి తదితరులు ఉన్నారు.