మేఘా కొన్న ఎలక్టోరల్ బాండ్లు రూ.966 కోట్లు

మేఘా కొన్న ఎలక్టోరల్ బాండ్లు రూ.966 కోట్లు
  • దేశంలోనే రెండో స్థానం
  • ఎన్​క్యాష్​మెంట్​లో రూ.6060.50 కోట్లతో బీజేపీ మొదటి స్థానం
  • రూ.1609.50 కోట్లతో టీఎంసీ సెకండ్ ప్లేస్
  • రూ.1421.90 కోట్లతో థర్డ్ ప్లేస్​లో కాంగ్రెస్
  • రూ. 1214.70 కోట్లతో నాలుగో స్థానంలో బీఆర్​ఎస్​
  • ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో ఎలక్టోరల్  బాండ్ల డేటా

న్యూఢిల్లీ: స్టేట్  బ్యాంక్  ఆఫ్​  ఇండియా (ఎస్బీఐ) తనకు సమర్పించిన ఎలక్టోరల్  బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) తన అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ డేటాను ఈసీ గురువారం తన వెబ్ సైట్ లో గడువు కన్నా ఒకరోజు ముందే అప్ లోడ్  చేసింది. రూ.లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి డినామినేషన్లలో బాండ్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఆ వెబ్ సైట్ లో ఉన్నాయి. గత నాలుగు, ఐదేండ్లలో ఈ కొనుగోలు జరిగాయి. వివిధ కంపెనీలు, వ్యక్తులు ఆ బాండ్లను కొనుగోలు చేశారు. ఈసీ వెబ్ సైట్ లో రెండు లిస్టులు ఉన్నాయి


ఎలక్టోరల్  బాండ్లను కొన్న కంపెనీల వివరాలు తేదీతో సహా మొదటి లిస్టులో ఉండగా.. ఆ బాండ్లను ఎన్ క్యాష్​  చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలు తేదీతో సహా రెండో లిస్టులో ఉన్నాయి. ఏ కంపెనీ ఏ పార్టీకి డొనేట్  చేసిందన్న వివరాలను ఈసీ పొందుపర్చలేదు. బాండ్లను కొన్న జాబితాలో ఫ్యూచర్  గేమింగ్  అండ్  హోటల్  సర్వీసెస్  పీఆర్  ఫస్ట్ ప్లేస్​లో ఉంది.

ఆ కంపెనీ రూ.1368 కోట్లు పెట్టి బాండ్లు కొన్నది. మేఘా ఇంజినీరింగ్  అండ్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్  లిమిటెడ్  రూ.966 కోట్లతో బాండ్లు కొని రెండో స్థానంలో నిలిచింది. క్విక్  సప్లై చెయిన్  ప్రైవేట్  లిమిటెడ్  రూ.410 కోట్లతో థర్డ్  ప్లేస్ లో, వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లతో నాలుగు, హల్దియా ఎనర్జీ లిమిటెడ్  రూ.377 కోట్లతో ఐదు, భారతి గ్రూప్  రూ.247 కోట్లతో ఆరు, ఎస్సెల్  మైనింగ్  అండ్  ఇండ్స్  లిమిటెడ్  రూ.224 కోట్లతో ఏడు, వెస్టర్న్  యూపీ పవర్  ట్రాన్స్ మిషన్  కంపెనీ రూ.220 కోట్లతో ఎనిమిది, కెవెంటర్  ఫుడ్ పార్క్  ఇన్ ఫ్రా రూ.195 కోట్లతో తొమ్మిది, మదన్ లాల్  లిమిటెడ్  రూ.185 కోట్లతో పదో స్థానాల్లో నిలిచాయి.

ఎన్ క్యాష్​  చేసుకున్న 15 పార్టీలు

బాండ్లను ఎన్ క్యాష్​  చేసుకున్న పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, శివసేన, టీడీపీ, వైసీపీ, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ  పార్టీలు ఉన్నాయి. వాటిలో బీజేపీ రూ.6060.50 కోట్లతో ఫస్ట్  ప్లేస్ లో నిలిచింది. రూ.1609.50 కోట్లతో టీఎంసీ రెండు, రూ.1421.90 కోట్లతో కాంగ్రెస్  మూడో స్థానంలో నిలిచింది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి ఎస్బీఐ తనకు అందజేసిన ఎలక్టోరల్  బాండ్లను తన అధికారిక వెబ్ సైట్ లో ఉంచామని ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

బాండ్ల వివరాలు వెల్లడించడానికి ముందు నుంచి తాము సుముఖంగా ఉన్నామని, పారదర్శకత కోసం పనిచేస్తున్నామని ఈసీ పేర్కొంది. కాగా, బాండ్ల వివరాలను ఈసీ వెల్లడించినా అందులో పూర్తి డేటా లేదని, ఎవరు ఏ పార్టీకి డొనేషన్లు ఇచ్చారో తెలియడం లేదని అడ్వొకేట్  ప్రశాంత్  భూషణ్​ తెలిపారు. ఎలక్టోరల్  బాండ్ల కేసులో అసోసియేషన్  ఆఫ్​ డెమోక్రటిక్  రిఫార్మ్స్  తరపున ఆయన వాదనలు వినిపించారు. ఈసీ వెబ్ సైట్ లో కనీసం సీరియల్  నంబర్లు  లేవన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంతిచ్చారో తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.