నో కరెంట్​.. నో వాటర్​: డబుల్ ఇండ్లలో కనీస సౌలతుల్లేవ్

నో కరెంట్​.. నో వాటర్​: డబుల్ ఇండ్లలో కనీస సౌలతుల్లేవ్
  • చిమ్మ చీకట్లలో  ‘డబుల్’ ఇండ్లు
  • రిలే దీక్షలకు దిగిన లబ్ధిదారులు

జనగామ జిల్లా కేంద్రం శివారు బాణాపురంలో పేదలకు ఇచ్చిన డబుల్​ బెడ్రూం ఇండ్లు చీకట్లో మగ్గుతున్నాయి. కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి కనీస సౌలతులు ఏర్పాటు చేయకుండానే గత నెలలో వీటిని పేదలకు ఇచ్చారు.
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రం శివారులోని బాణాపురంలో పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లు చీకట్లో మగ్గుతున్నాయి. కనీసం సదుపాయాలైన నీళ్లు, కరెంట్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకుండానే గత నెలలో అట్టహాసంగా గృహప్రవేశాలు చేయించిన ఆఫీసర్లు ఆ తర్వాత ఇటు చూడలేదు. వాటిలోనే ఉంటున్న నిరుపేదలు చీకటి పడితే కొవ్వొత్తులు వెలిగించుని బిక్కుబిక్కుమంటున్నారు. పాములు, తేళ్లు ఇండ్లలోకి వస్తున్నా తెలియట్లేదని వాపోతున్నారు. తాము త్యాగం చేసిన స్థలంలో నిర్మించిన కలెక్టరేట్​లో మాత్రం ఆగమేఘాల మీద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. త్వరలో సీఎం పర్యటన ఉందని తెలిసి ఆఫీసర్లు హడావుడి చేస్తున్నట్లు సమాచారం. డబుల్​బెడ్​రూం ఇండ్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ లబ్ధిదారులు మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 
నాన్చుతూ వచ్చి..
బాణాపురంలోని సూర్యాపేట రోడ్డులో ఉండే ఏసీరెడ్డి నగర్ లో గుడిసెలు వేసుకుని ఉన్న పేదలను నాలుగేండ్ల కింద అధికారులు ఖాళీ చేయించారు. వాళ్ల గుడిసెల ప్లేసులో కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ కడుతున్నారు. అప్పటి నుంచి గుడిసెలు ఖాళీ చేసిన పేదలకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో ఆర్నెళ్లలో డబుల్​బెడ్​రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ఆఫీసర్లు నాలుగేండ్లుగా నాన్చుతూ వచ్చారు. ఇండ్ల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పేదలు 2 నెలల క్రితం బాణాపురంలో నిర్మించిన డబుల్​ఇండ్ల తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశాలు చేశారు. అప్పుడు అధికారులు వచ్చి వారిని ఖాళీ చేయించిన గత నెల10న కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిలు అధికారికంగా 200 కుటుంబాలకు పట్టాలు ఇచ్చి గృహ ప్రవేశం చేయించారు. ఆర్భాటంగా అయితే చేశారుగానీ ఇండ్లలో కనీస సౌలతులు కల్పించలేదు. కరెంట్, నీటి సరఫరా, సైడ్ డ్రైన్​లు, అంతర్గత రోడ్లు ఇవేమీ లేవు. కాలనీలో నామమాత్రంగా ఒక్క బోరు వేశారు. దాన్నే 200 కుటుంబాలు వాడుకోవాలి. ఇంత మందికి ఒక్కబోరు నీళ్లు ఎలా సరిపోతాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో రాత్రిళ్లు బయటకు రావాలంటే బాధితులు జంకుతున్నారు. దానికి తోడు ఇండ్లు ఊరు చివరన ఉన్నాయి. చుట్టూ  వ్యవసాయ భూములే ఉండడంతో విషపురుగుల సంచారం ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. పలువురి ఇండ్లల్లోకి పాములు తేళ్లు వచ్చాయని చెబుతున్నారు. సైడ్​డ్రైన్​లు లేక మురుగు నీళ్లతో ఇక్కట్లు ఎక్కువయ్యాయి. అంతర్గత రోడ్ల సంగతి దేవుడెరుగు. తాము త్యాగం చేస్తే కట్టిన కలెక్టరేట్​లో ఆగమేఘాల మీద సౌకర్యాలు కల్పిస్తున్న ఆఫీసర్లు తమకు ఇచ్చిన డబుల్​బెడ్ రూం ఇండ్లల్లో మాత్రం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.

నీళ్లకు గోస పడ్తున్నం
నీళ్లకు మస్తు గోస అయితాంది. 200 కుటుంబాలు ఒక్క చేతి పంపును వాడుకోవాలంటే ఎట్లా.. నీళ్లు సరిపోతలేవు. కరెంటు లేక చిమ్మ చీకట్లనే ఉంటున్నం. మేం త్యాగం చేస్తే కొత్త కలెక్టరేట్ కట్టిన్రు. మాకు ఇచ్చిన ఇండ్లళ్ల మాత్రం సౌలతులు లేవు.  – సఫియా బేగం, ఏసీరెడ్డి నగర్​
విష పురుగులు వస్తున్నయ్
ఇండ్లళ్లకు విష పురుగులు వస్తున్నయ్.. కరెంట్ లేక పోవడంతో ఇబ్బంది అయితాంది. పేరుకే ఇండ్లు ఇచ్చిండ్రు. రోడ్లు లేవు, మురుగు కాల్వలు లేవు. నీళ్లు లేవు. ఎవరూ పట్టించుకుంటలేరు.​ రాత్రయితే బయటకు రావాలంటే భయమైతాంది. 15 రోజుల్లో సౌలతులు కల్పిస్తం అన్నరు. ఇప్పటి వరకు జాడ లేదు. ఇకనైనా ఆఫీసర్లు స్పందించాలె.
                                                                                                                                                                                                                        - సరిత, ఏసీరెడ్డి నగర్