కరెంట్​ సంఘాల పెండింగ్​ బిల్లులు కోట్లలో

కరెంట్​ సంఘాల పెండింగ్​ బిల్లులు కోట్లలో
  • పేదోడు నెల రోజుల బిల్లు కట్టకుంటే కరెంట్​ కట్
  • కరెంటోళ్ల వివక్షపై విమర్శలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరెంట్ బిల్లుల వసూళ్లలో విద్యుత్‌‌‌‌ సంస్థలు వివక్ష చూపుతున్నయి. సామాన్యులకో న్యాయం.. సంఘాలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పేదోడు నెల రోజుల బిల్లు కట్టకుంటేనే.. ఇంటికి కరెంట్​కట్​చేసే అధికారులు.. మరి ఏండ్లుగా రూ. కోటి వరకు బిల్లు బకాయి పడిన విద్యుత్​సంఘాలను ఎందుకు పట్టించుకుంటలేరనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వ్యవసాయ కనెక్షన్​ బిల్లు కట్టలేదని ఇంటి కరెంట్​కట్ ​చేస్తున్నారని పలువురు రైతులు ఈఆర్​సీ మీటింగుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, సాధారణ ప్రజల దగ్గర బిల్లులు పక్కాగా వసూలు చేస్తున్న అధికారులు.. సంఘాల బకాయి బిల్లులను మాత్రం పట్టించుకుంటలేరు. ఏకంగా రూ.కోటి వరకు డిస్కంలకు ఉద్యోగ సంఘాలు బిల్లులు కట్టకుండా పెండింగ్‌‌‌‌ పెడుతున్నాయి. దీనిపై ఈఆర్‌‌‌‌సీలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

సదరన్‌‌‌‌ డిస్కం చుట్టు పక్కలనే..
హైదరాబాద్‌‌‌‌ కేంద్రంగా ఉన్న సదరన్‌‌‌‌ డిస్కం చుట్టు పక్కల, మింట్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌లో సంస్థ కార్పొరేట్‌‌‌‌ ఆఫీస్​ముందు, ఆఫీస్‌‌‌‌ వెనక ఉన్న కనెక్షన్‌‌‌‌లపై రూ.కోట్లలో  కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆఫీస్ వెనక ఉన్న ఒక్క కనెక్షన్‌‌‌‌ బిల్లు రూ.56 లక్షలకు పైగా ఉంది. సంస్థ ముందున్న మరో కనెక్షన్‌‌‌‌ రూ.11లక్షల బిల్లు పెండింగ్‌‌‌‌లో ఉంది. ఇలా సంస్థ చుట్టుపక్కలే కోటి రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉండటం గమనార్హం. 

ఎందుకు వసూలు చేయట్లేదు..
సదరన్‌‌‌‌ డిస్కం కార్పొరేట్‌‌‌‌ ఆఫీసు చుట్టు పక్కల ఉన్నవన్నీ ఉద్యోగ సంఘాల ఆఫీసులే. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు వారి సంఘం ఆఫీస్​బిల్లులు మాత్రం కట్టడం లేదు. దీంతో కోట్లలో బిల్లులు పెండింగ్‌‌‌‌లో పడిపోయాయి. ఇప్పుడంతా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బిల్లింగ్‌‌‌‌ జరుగుతోంది కాబట్టి ఎవరు ఎంత బిల్లు కట్టాలి? ఎంత కట్టారు? పెండింగ్‌‌‌‌ ఎంత? అనే వివరాలు ఆఫీసర్లకు తెలిసిపోతుంది. ఇలా కోటికి పైగా బకాయి పడినా బిల్లులు వసూలు చేయకపోవడం వెనక.. ఉద్యోగ సంఘాల మీద ప్రేమనా, అధికారుల బండారం బయట పెడుతారనే భయమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సంఘాల బకాయిలు వసూలు చేయడంలో దశాబ్దాలుగా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సాధారణ వినియోగదారుడు కరెంట్ బిల్లు కట్టకపోతే ప్రతి నెల 24 తర్వాత స్పెషల్​డ్రైవ్‌‌‌‌ నిర్వహించి కనెక్షన్‌‌‌‌ కట్‌‌‌‌ చేస్తారు. అయినా కట్టకపోతే 3 నెలల తర్వాత మీటరు తొలగించి అతని సర్వీసును హోల్డ్(ఓఎస్ఎల్‌‌‌‌ ) లో ఉంచుతారు. వినియోగదారుడు బిల్లు చెల్లించడానికి వెళ్తే టెక్నికల్ సిబ్బంది అకౌంట్ సెక్షన్ కి, అకౌంట్ సెక్షన్ వాళ్లు టెక్నికల్ సెక్షన్ కు తిప్పుతారు. బిల్లుతో పాటు అదనంగా మీటరు పెట్టడానికి చార్జెస్ డీడీ రూపంలో వసూలు చేస్తారు. ఇలా సామాన్యుల కష్టాలకు గురి చేసే అధికారులు కోట్ల రూపాయల బకాయిలను మాత్రం పట్టించుకుంటలేరు.

బాధ్యతారాహిత్యం వద్దు
వినియోగదారుడిని కరెంటు బిల్లు కట్టాలని ప్రశ్నించే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మనం ఎందుకు బిల్లు కట్టడం లేదని ప్రశ్నించుకోవాలి. సంస్థలో పని చేస్తూ ఇంత బాధ్యతా రాహిత్యంగా పని చేస్తే ఎలా? రెండు దశాబ్దాలకు పైగా కరెంట్ బిల్లులు కట్టక పోయినా పైఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో చెప్పాలి. మనది మనం సరి చేసుకోకుండా ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది. సీఎండీలు, డైరెక్టర్లు మారినా బిల్లులు మాత్రం పెండింగ్‌‌‌‌లోనే ఉంటున్నాయి. 
- నాగరాజు, అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌

విద్యుత్‌‌‌‌ సంఘాల పెండింగ్‌‌‌‌ బిల్లులు ఇలా..
సంఘాల పేరు    మీటర్‌‌‌‌ నంబర్‌‌‌‌    పెండింగ్‌‌‌‌ బిల్లు
1104    బీ1001537    రూ.56,78,840
327    బీ1009406    రూ.11,30,522
ఏపీఎస్‌‌‌‌ఈబీ ఎస్సీ,ఎస్టీ    బీ1009409    రూ.7,06,213
తెలుగునాడు    బీ1009412    రూ.5,87,861
ఎపీఎస్‌‌‌‌ఈబీ టెక్నికల్‌‌‌‌    బీ1009413    రూ.2,77,521
ఎస్సీ, ఎస్టీ సంఘం    బీ1012448    రూ.1,10,584
టీఆర్‌‌‌‌వీకేఎస్‌‌‌‌    బీ1015051    రూ.3,434