కొన్ని నెలల్లో మార్కెట్లోకి రాబోతున్న ‘ఎలక్ట్రిక్ సైబర్ ట్రక్’ డిజైన్‌ను అమెరికా కార్ల కంపెనీ ‘టెస్లా’ ఇటీవలే రిలీజ్ చేసింది. దాన్ని చూసినోళ్లకు 1976లో రిలీజైన జేమ్స్ బాండ్ ‘ద స్పై హూ లవ్డ్ మీ’ సినిమా గుర్తుకొచ్చింది. కారులో వెళ్తున్న హీరోను హెలికాప్టర్‌లో పోలీసులు ఫాలో అవుతుండటంతో నీటిలోకి బాండ్ వేగంగా వెళ్తాడు. ఓ బటన్ నొక్కగానే జలాంతర్గామిగా మారి క్షిపణులతో హెలికాప్టర్‌ను పేల్చేస్తుంది. అక్కడ వాడిన కారు లోటస్ ఎస్ప్రిట్ కంపెనీది. టెస్లా రిలీజ్ చేసిన ‘ఎలక్ట్రిక్ సైబర్ ట్రక్’ కూడా అచ్చం అలానే ఉంది.
1989 లో న్యూయార్క్ వచ్చిన ఓ జంట వేలంలో ఓ ఇంటి సామగ్రిని వంద డాలర్లకు (రూ.7,154) కొన్నది. ఆ ఇంటి తాళం తీసి చూడగా కొన్ని వస్తువులతోపాటు ఈ స్పోర్ట్స్ కారు’ కూడా ఉంది. జేమ్స్ బాండ్ సినిమాలు చూడని వాళ్లకు కారు విలువ పెద్దగా తెలియలేదు. ఓ ట్రక్కు డ్రైవర్ ఆ కారును చూసి దాని గురించి వాళ్లకు చెప్పాడు. ఆశ్చర్యపోయిన ఆ జంట కారును బాగు చేయించి 20 ఏళ్లపాటు ఆయా ఎగ్జిబిషన్స్‌లో పెట్టింది. ఓ ఎగ్జిబిషన్‌లో ఆ కారును చూసిన గుర్తుతెలియని వ్యక్తి భారీగా చెల్లించి కొన్నాడు. ఆ కారు కొన్నది టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అని, దానికి 7 కోట్ల15 లక్షలు చెల్లించాడని తెలిసింది.
