అది ఫిర్యాదు లేఖ కాదు.. రిపోర్టు మాత్రమే

అది ఫిర్యాదు లేఖ కాదు.. రిపోర్టు మాత్రమే

మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్, ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావెద్, మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది.  ఏమైనా సమస్యలుంటే చర్చిద్దామని మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. జగ్గారెడ్డి, వెంకట్ రెడ్డి ఇష్యూ ముగిసిందని.. మర్రి శశిధర్ రెడ్డితో మంతనాలు చేస్తున్నామని చెప్పారు. ‘‘సీనియర్లకు జూనియర్లకు గ్యాప్ ఉందని కలిసి మాట్లాడుకుంటామని అన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా తన పని తాను చేస్తున్నానని . రెగ్యులర్ గా ఢిల్లీకి రిపోర్ట్ పంపుతుంటానని చెప్పారు.. నిన్న పంపాల్సిన రిపోర్ట్ ఇవ్వాళ పంపానే తప్ప అది ఫిర్యాదేం కాదు’’ అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు 

మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఏమన్నారంటే..

కాంగ్రెస్​లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమని మర్రి శశిధర్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్​కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందన్నారు. ‘‘మాణిక్కం ఠాగూర్‌‌ చేతిలో రేవంత్‌‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదు. ఠాగూరే.. రేవంత్‌‌ చేతిలో పని చేస్తున్నట్టు ఉంది. రేవంత్​కు ఏజెంట్​​లా ఠాగూర్​ మారినట్లు ఉంది” అని శశిధర్​రెడ్డి విమర్శించారు. రాహుల్‌‌ గాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు.