పిల్ల దొరుకుతలేదని బ్యాచిలర్స్ నిరసన

పిల్ల దొరుకుతలేదని బ్యాచిలర్స్ నిరసన

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య పెళ్లి. ఎంతో మంది తమకు అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కాని యువకులంతా కలిసి తమ రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆందోళన చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ లో జరిగింది. పెళ్లి ఈడు వచ్చిన యువకులు ఓ సంస్థగా ఏర్పడి మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ లో బ్రహ్మచారులు పెళ్లి దుస్తులు ధరించి, గుర్రపు స్వారీ చేస్తూ, బ్యాండ్ బాజాతో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు వధువు కావాలని డిమాండ్ చేశారు.  మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని వారు ఆరోపించారు.

ఈ సందర్భంగా యువకులు, కలెక్టర్ ఆఫీస్ లో మెమోరాండం సమర్పించారు. ఇది చూడడానికి నవ్వును తెప్పిస్తుండొచ్చు.. కానీ స్ర్తీ- పురుష నిష్పత్తి సరిగా లేకపోవడం వల్ల వివాహ వయస్సులో యువకులు తీవ్ర వేదన చెందుతున్నారని జ్యోతి క్రాంతి పరిషత్ వ్యవస్థాపకుడు రమేష్ బరాస్కర్ అన్నారు. మహారాష్ట్రలోని లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 889 మంది బాలికలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. "ఈ అసమానత భ్రూణహత్యల కారణంగా ఏర్పడిందని, ఈ అసమానతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బరస్కర్ చెప్పారు.