ఇండియాలో స్టార్‌లింక్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్

ఇండియాలో స్టార్‌లింక్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ కంపెనీ 'స్టార్‌లింక్' భారత్‌లో తన సేవలను ప్రారంభించేందుకు నిరీక్షణను ఎదుర్కొంటోంది. అవసరమైన లైసెన్సులు పొంది ఏడాది గడిచినా.. ఇప్పటికీ తుది అనుమతులు రాకపోవడంపై మస్క్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించగా.. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించి మస్క్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

"ఒలిగార్చ్‌ల" వల్లనే అడ్డంకులు..
భారత్‌లో గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే కొందరు "ఒలిగార్చ్‌లు" (పెట్టుబడిదారీ దిగ్గజాలు) స్టార్‌లింక్‌కు అడ్డు తగులుతున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఎక్స్ పోస్టులో మండిపడ్డారు. తమ కంపెనీ రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో కూడా మీకు తెలుసు అంటూ ప్రజలకే సమాధానం వదిలేయటం చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఇంటర్నెట్ సదుపాయమే లేని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్, సరసమైన ఇంటర్నెట్ అందించేందుకే తాము సిద్ధంగా ఉన్నామని మస్క్ పేర్కొన్నారు. భారత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే తమ వ్యవస్థను రూపొందించామని, యూజర్ డేటా పూర్తిగా భారత్‌లోనే ఉండేలా ప్రత్యేక కంట్రోల్స్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటికే 20 గేట్‌వే కేంద్రాలు నిర్మించినట్లు స్పేస్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో వెల్లడించారు.

భారత్‌లో జాప్యానికి కారణాలు?
భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, ప్రాధికార కేంద్రం (IN-SPACe) నుంచి, టెలికాం శాఖ నుంచి స్టార్‌లింక్ ఇప్పటికే జీఎంపీసీఎస్ లైసెన్సులు పొందింది. రిలయన్స్ జియో సంస్థకు చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతీ ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ వంటి సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. అయితే విదేశీ శాటిలైట్ ఆపరేటర్లు భారతీయ గేట్‌వేలను దాటవేసి సేవలు అందిస్తారనే భద్రతా ఆందోళనలు ప్రభుత్వంలో ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే దేశ భద్రతపై నియంత్రణ కోల్పోయే ప్రమాదముందని కేంద్రం భావిస్తోంది. భద్రతా నిబంధనల కింద డేటా లోకలైజేషన్, భారత గడ్డపైనే గేట్‌వేల ఏర్పాటు, ప్రభుత్వ నిఘాకు సహకరించడం వంటి కఠిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఘాటు స్పందన..
ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం నిరాధారమైనవి, అసంబద్ధమైనవి అంటూ కొట్టిపారేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ అత్యంత పారదర్శకమైన, వివక్ష రహితమైన నిబంధనలను అమలు చేస్తోందని స్పష్టం చేసింది. ఎవరికీ ప్రత్యేకంగా అనుకూలంగా వ్యవహరించడం లేదని, నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని తేల్చిచెప్పింది.