వరల్డ్​ నంబర్​ 1 ధనవంతుడిగా బెర్నార్డ్​ అర్నాల్ట్.. 3వ ప్లేస్​ లో అదానీ, 8వ ప్లేస్​ లో అంబానీ​ 

వరల్డ్​ నంబర్​ 1 ధనవంతుడిగా బెర్నార్డ్​ అర్నాల్ట్.. 3వ ప్లేస్​ లో అదానీ, 8వ ప్లేస్​ లో అంబానీ​ 

‘ఫోర్బ్స్​’ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్​ 1 స్థానాన్ని అపర కుబేరుడు, ట్విట్టర్​ అధినేత ఎలాన్​ మస్క్​ కోల్పోయారు. నెంబర్​ 1 ధనవంతుడి స్థానాన్ని ఫ్రాన్స్​ కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ  LVMH కు సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నార్డ్​ అర్నాల్ట్​  కైవసం చేసుకున్నారు. దీంతో మస్క్​ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక ఇండియాకు చెందిన వ్యాపార దిగ్గజం గౌతమ్​ అదానీ 134.6 బిలియన్​ డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. ఈకామర్స్​ దిగ్గజం అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​ 113.8 బిలియన్​ డాలర్ల నికర సంపదతో నాలుగో స్థానం పొందారు. ఈ జాబితాలో రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ 92.8 బిలియన్​ డాలర్ల నికర సంపదతో 8వ స్థానంలో నిలిచారు. 

మస్క్​ నంబర్​ 1 స్థానాన్ని ఎందుకు కోల్పోయాడంటే..

మస్క్​ నంబర్​ 1 స్థానాన్ని కోల్పోవడానికి పలు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 44 బిలియన్​ డాలర్లతో ట్విట్టర్​ ను కొనుగోలు చేసే డీల్​ ను మస్క్​ కుదుర్చుకున్న సమయంలోనే.. అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ కొన్ని కఠినమైన ఆర్థిక విధానానాలను ప్రకటించింది. ఇది కూడా మస్క్​ పాలిట ప్రతికూలంగా పరిణమించింది. అంతేకాదు ఈ డీల్​ కోసం నిధులను సమకూర్చుకునేందుకు మస్క్​ తన ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ టెస్లాలోని కొన్ని షేర్లను అమ్ముకున్నారు. దీంతో 2022 సంవత్సరంలో ఇప్పటివరకు టెస్లా కంపెనీ షేరు విలువ దాదాపు 50 శాతానికిపైగా తగ్గిపోయింది.  ఫలితంగా దాదాపు 168 బిలియన్​ డాలర్ల మస్క్ సంపద ఆవిరైందని న్యూయార్క్​ లోని బ్లూమ్​ బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ వెల్లడించింది.

అంతకుముందు రెండేళ్ల పాటు..

అంతకుముందు రెండేళ్ల పాటు అమెరికా స్టాక్​ మార్కెట్లో  టెస్లా కంపెనీ షేరు హవా కొనసాగింది. దీంతో రెండేళ్ల క్రితం ఒకానొక దశలో మస్క్​ నికర సంపద విలువ దాదాపు 340 బిలియన్​ డాలర్లకు చేరింది. కానీ బంగారు బాతు లాంటి టెస్లా కంపెనీ షేర్లను అమ్ముకోవాలని మస్క్​ తీసుకున్న నిర్ణయం ఆయన సంపదను అమాంతం తగ్గించేసింది. దీంతో నికర సంపద విలువ కాస్తా 340 బిలియన్​ డాలర్ల నుంచి 181.3 బిలియన్​ డాలర్లకు డౌన్​ అయిపోయింది.  ఇక ఇదే వ్యవధిలో ఫ్రాన్స్​ కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ  LVMH కి సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నార్డ్​ అర్నాల్ట్​ సంపద విలువ 186.5 బిలియన్​ డాలర్లు దాటింది. దీంతో ఫోర్బ్స్​ అత్యంత ధనవంతుల జాబితాలో అర్నాల్ట్​ కు మొదటి స్థానం దక్కింది.