ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడు ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడు ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్‌ సూచీ ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్‌ ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ను మస్క్ వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ 185.3 బిలియన్‌ డాలర్లు కాగా..  తాజాగా టెస్లా షేర్ల విలువ పెరగడంతో మస్క్‌ మరోసారి ఈ సూచీలో అత్యున్నత స్థానానికి చేరారు. నిజం చెప్పాలంటే గతేడాదినవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో మస్క్‌ ఆస్తుల విలువ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు పతనమైంది. ఈ క్రమంలో చరిత్రలోనే అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’  కూడా ప్రకటించింది. 

2021లో నవంబర్లో 340 బిలియన్‌ డాలర్లున్న ఆస్తులు గతేడాది చివర్లో దాదాపు 137 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దీంతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడి స్థానం దక్కించుకున్నారు. మస్క్‌ కంపెనీ టెస్లా షేర్లు కొవిడ్‌, చైనా లాక్‌డౌన్ల కారణంగా 65శాతం విలువ కోల్పోయాయి. 2022 సంవత్సరం టెస్లాకు అత్యంత దారుణంగా గడిచిందని నిపుణులు చెబుతున్నారు. ఆ కంపెనీ దాదాపు 700 బిలియన్‌ డాలర్లు కోల్పోయింది.