కక్ష్య దాకా వెళ్లి గిరికీలు కొట్టింది!.. మళ్లీ ఫెయిలైన స్పేస్ఎక్స్ స్టార్ షిప్

కక్ష్య దాకా వెళ్లి గిరికీలు కొట్టింది!.. మళ్లీ ఫెయిలైన స్పేస్ఎక్స్ స్టార్ షిప్
  • డమ్మీ శాటిలైట్ల విడుదలలో ఆటంకం 
     

టెక్సస్: బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్ షిప్ రాకెట్ వరుసగా మూడోసారి ఫెయిల్ అయింది. ఇటీవల నిర్వహించిన రెండు ప్రయోగాల్లో రాకెట్ తొలిదశలోనే పేలిపోగా.. ఈసారి కక్ష్య వరకూ చేరుకోగలిగింది. కానీ అక్కడ డమ్మీ శాటిలైట్లను రిలీజ్ చేసి, కిందకు దిగాల్సిన సమయంలో గిరికీలు కొడుతూ ముక్కలైపోయింది. మంగళవారం సాయంత్రం అమెరికా టెక్సస్ తీరంలోని స్టార్ బేస్ నుంచి స్పేస్ఎక్స్ స్టార్ షిప్ రాకెట్ 9వ ప్రయోగం జరిగింది. స్టార్ బేస్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన రాకెట్ తొలుత సాఫీగానే ప్రయాణించింది. 

అయితే, నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత అప్పర్ స్టేజీని విడిచిపెట్టిన రాకెట్ బూస్టర్ కంట్రోల్డ్ విధానంలో సముద్రంలో దిగాల్సి ఉండగా.. పేలిపోయింది. ఆ తర్వాత పైకి దూసుకెళ్లిన స్టార్ షిప్ అప్పర్ స్టేజీ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. కానీ అక్కడ శాటిలైట్ బే డోర్ తెరుచుకోకపోవడంతో డమ్మీ శాటిలైట్లను రిలీజ్ చేయలేకపోయింది. దాంతోపాటు స్టార్ షిప్ ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ కావడంతో స్పేస్ క్రాఫ్ట్ గిరికీలు కొడుతూ ముక్కలైపోయింది. స్టార్ షిప్ శకలాలు అదే వేగంతో హిందూ మహాసముద్రంకూలిపోయాయని స్పేస్ఎక్స్ కంపెనీ వెల్లడించింది. 

కక్ష్యలో డమ్మీ శాటిలైట్లను రిలీజ్ చేసిన తర్వాత స్టార్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ హిందూ మహాసముద్రంలో కంట్రోల్డ్ విధానంలో దిగాల్సి ఉండగా.. ఇది కూడా ఫెయిల్ అయింది. ఫ్యూయెల్ లీకేజీ వల్లే ఈ ప్రయోగం విఫలమైందని స్పేస్ఎక్స్ కంపెనీ తెలిపింది. ప్రయోగం పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. కాగా, చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు స్టార్ షిప్ రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ను స్పేస్ఎక్స్ కంపెనీ పరీక్షిస్తోంది. తాజా ప్రయోగంలో స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య నుంచి తిరిగి భూమిపైకి వస్తున్నప్పుడు హీట్ టైల్స్ సామర్థ్యాన్ని పరీక్షించడమే ప్రధాన లక్ష్యం కాగా, ఇందులోనే వైఫల్యం ఎదురైంది.

ఫ్యూయెల్ లీక్​తో ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిన శకలాలు

గత ప్రయోగం కన్నా ఇంప్రూవ్ అయ్యాం: మస్క్ 

స్టార్ షిప్ ఫెయిల్యూర్​పై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. గత ప్రయోగంతో పోలిస్తే ఈసారి మరింత మెరుగయ్యామని అభిప్రాయపడ్డారు. ‘‘షెడ్యూల్ ప్రకారమే స్టార్ షిప్ ఇంజిన్ కటాఫ్ అయింది. పైకి ఎగురుతున్నప్పుడు హీట్ షీల్డ్ టైల్స్ పెద్దగా డ్యామేజ్ కాలేదు. రీఎంట్రీ దశలో ఫ్యూయెల్ లీక్ కావడంతో మెయిన్ ట్యాంక్ ప్రెజర్ పడిపోవడం సమస్యగా మారింది. ఈ ప్రయోగానికి సంబంధించి చాలా మంచి డేటా ఉంది. దానిని రివ్యూ చేయాలి. అలాగే ముందస్తుగా నిర్ణయించిన ప్రయోగాలు యథావిధిగా జరుగుతాయి” అని మస్క్​ ట్వీట్ చేశారు.