ఎల్లంపల్లి నుంచి ఎమర్జెన్సీ నీటి పంపింగ్ షురూ

ఎల్లంపల్లి నుంచి ఎమర్జెన్సీ నీటి పంపింగ్ షురూ
  •     కరీంనగర్​జిల్లా ముర్ముర్ వద్ద 20 పైపులు ఏర్పాటు
  •     ప్రస్తుతం ఏడు పైపుల ద్వారా నీటి ఎత్తిపోత
  •     సిటీ అవసరాన్ని దశల వారీగా మిగతా పైపులు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వాటర్​బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్​రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ పంపింగ్​కోసం ముర్ముర్​వద్ద ప్రత్యేకంగా 20 పైపులు ఏర్పాటు చేశామని, వాటిలోని ఏడు పైపుల ద్వారా ప్రస్తుతం నీటిని ఎత్తిపోస్తున్నామని వెల్లడించారు.

 సిటీలోని నీటి అవసరాన్ని బట్టి మిగిలిన పైపులను దశల వారీగా ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం ఆయన వాటర్​బోర్డు ఉన్నతాధికారులతో కలిసి ముర్ముర్​వద్ద ఎమర్జెన్సీ పంపింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి నుంచి హైదరాబాద్​కు 168 ఎంజీడీల నీరు తరలించనున్నట్లు వివరించారు. ఎగువనున్న కడెం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం వరద ప్రవాహం లేదని, దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గుతోందని చెప్పారు.

 వర్షాలు పడకపోతే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ద్వారా అందించే నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ పంపింగ్ చేపట్టినట్లు ఎండీ సుదర్శన్​రెడ్డి వివరించారు. అలాగే ముర్ముర్ లోని గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజక్టు పంప్ హౌజ్ ను సందర్శించి, స్కాడా రూం రికార్డులు పరిశీలించారు. అనంతరం మల్లారంలోని నీటిశుద్ధి కేంద్రాన్ని సందర్శించారు.

 అక్కడ నీటి శుద్ధి జరిగే ప్రక్రియ, నీటి పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో కొత్త నీరు చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో గంటకు ఒకసారి శాంపిల్ తీసి టెస్ట్ చేయాలని సూచించారు. ఆయన వెంట ట్రాన్స్ మిషన్​ సీజీఎం దశరథ్ రెడ్డి, జీఎం బ్రిజేష్, ఇతర అధికారులు ఉన్నారు.

ఇక్కడి నుంచే కీలక ప్రాంతాలకు..

ఎల్లంపల్లి రిజర్వాయర్‌‌‌‌లో సమృద్ధిగా నీరు ఉంటే గ్రావిటీ ద్వారా ముర్ముర్ లోని పంప్ హౌజ్ కు తీసుకొస్తారు. పంపింగ్ ద్వారా అక్కడి నుంచి సిద్దిపేట దగ్గర్లోని మల్లారం పంప్ హౌజ్‌‌‌‌కు నీటిని తరలిస్తారు. ఆ తర్వాత సిటీకి సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ పంపింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్‌‌‌‌, కొండాపూర్‌‌‌‌, గచ్చిబౌలి, హైటెక్‌‌‌‌ సిటీ, లింగంపల్లి, మియాపూర్‌‌‌‌, చందానగర్‌‌‌‌, కూకట్‌‌‌‌పల్లి, కేపీహెచ్‌‌‌‌బీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల ద్వారానే నీరు అందిస్తున్నారు.

 గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేపట్టారు. చివరిసారిగా 2016లో ఎమర్జెన్సీ పంపింగ్​తో నీటిని ఎత్తిపోసి హైదరాబాద్‌‌‌‌కు తరలించారు. కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా ఇప్పటికే నాగార్జునసాగర్ రిజర్వాయర్‌‌‌‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌‌‌‌ ఏర్పాటు చేసి, సిటీకి నీటిని తరలిస్తున్నారు.