V6 News

టైం కంటే ముందే ఆఫీసుకు వస్తున్న ఉద్యోగిని పీకేసిన కంపెనీ.. తొలగింపును సమర్థించిన కోర్ట్..!

టైం కంటే ముందే ఆఫీసుకు వస్తున్న ఉద్యోగిని పీకేసిన కంపెనీ.. తొలగింపును సమర్థించిన కోర్ట్..!

ఆఫీస్ అంటే ఆఫీసే.. టైం అంటే టైమే.. ఇది మన దేశంలో కాదండీ.. విదేశాల్లో. ఓ కంపెనీలో ఓ మహిళ ఉద్యోగం చేస్తుంది. రెండేళ్లుగా చేస్తుంది. ఆమెను ఇప్పుడు ఉద్యోగం నుంచి తీసేశారు.. ఎందుకు అంటారా.. ఆఫీస్ టైం కంటే ముందే ఆఫీసుకు రావటం. అవును.. ఆఫీసులో ఆమె షిఫ్ట్ టైం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు.. ఆమె మాత్రం ఉదయం 6 గంటల 45 నిమిషాలకే ఆఫీసుకు వస్తుంది.. ఈ విషయంపై కంపెనీ ఆమెకు నోటీసు ఇచ్చింది. ఆఫీస్ టైం కంటే ముందే ఎందుకు వస్తున్నావు.. రావొద్దు.. నీ టైం ప్రకారం నువ్వు రా అని ఆదేశించింది. అయినా కూడా ఆ మహిళా పలుసార్లు తన షిఫ్ట్ టైం కంటే ముందే ఆఫీసుకు వచ్చింది.. దీంతో కంపెనీ ఆ మహిళా ఉద్యోగిని.. ఉద్యోగం నుంచి పీకేసింది. కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆ మహిళా ఉద్యోగి కోర్టుకు వెళ్లింది. కోర్టు కూడా కంపెనీకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. ఎందుకిలా జరిగింది.. ఎక్కడ జరిగింది... పూర్తి వివరాలు తెలుసుకుందామా...

సాధారణంగా ఆఫీసుకి ఆలస్యంగా వస్తే బాసులు తిడతారు, ఇంకా ఆలస్యమైతే శాలరీ కట్ చేస్తారు. చెప్పినా వినకపోతే చివరికి ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కానీ ఒక ఉద్యోగిణి ఆఫీసుకి చాలా ముందుగా వచ్చినందుకు ఆమెను కంపెనీ ఇంటికి పంపించేసింది. వినడానికి వింతగా ఉన్నా, స్పెయిన్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ALSO READ : బ్రెయిన్ క్యాన్సర్‌‌‌‌ చికిత్సకు కొత్త మందు..

స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. ఆమె తన షిఫ్ట్ సమయం కంటే సుమారు 40 నిమిషాల ముందే ఆఫీసుకి చేరుకోవడం అలవాటు చేసుకుంది. ఆమె షిఫ్ట్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆమె మాత్రం ప్రతిరోజూ 6:45 నుండి 7:00 గంటల మధ్యలోనే ఆఫీసులో ప్రత్యక్షమయ్యేది. దాదాపు రెండేళ్లపాటు ఆమె ఇలాగే చేసింది. ఆమె త్వరగా రావడం పట్ల కంపెనీ ప్రతినిధులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందే వస్తే ఆఫీసులో చేయడానికి పనేమీ ఉండదు.. కాబట్టి షిఫ్ట్ సమయానికే రమ్మని ఆమెకు మౌఖికంగా, లిఖితపూర్వకంగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యువతి మాత్రం తన మొండివైఖరిని వీడలేదు. 

కొన్నిసార్లు ఆమె ఆఫీస్ క్యాంపస్‌లోకి రాకముందే, కంపెనీ యాప్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించేది. ఇది ఆమె నిబద్ధతను కాకుండా కంపెనీ నిబంధనలను ధిక్కరించే ధోరణిని చూపుతోందని యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తనను తీవ్రమైనదిగా అలాగే నమ్మకద్రోహం గా పరిగణించిన బాస్.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించి తనను అన్యాయంగా తొలగించారంటూ దావా కూడా వేసింది. 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కోర్ట్ కూడా కంపెనీ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సరైనదిగా గుర్తించింది. ఆమె తీరు వల్ల టీమ్ కోఆర్డినేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయని తోటి ఉద్యోగులు సాక్ష్యం కూడా చెప్పారు. ఈ కేసులో కంపెనీ ఆదేశాలను పాటించకపోవటం క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆమెను తొలగించడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇండియాలో మాత్రం ఆఫీసుకు ముందొస్తే ఉద్యోగి విషయంలో యాజమాన్యాలు భవిశా ఇలా అస్సలు చేయవేమో.