
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల్లో ఏడున్నరేండ్లుగా ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడుతున్నా పదోన్నతి కోసం వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్సర్కారు రిటైర్మెంట్ వయసును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచింది. కానీ, ప్రమోషన్లు ఇవ్వడానికి మొగ్గు చూపకపోవడంతో ఇప్పటికీ విద్యుత్ఉద్యోగులు, అధికారులకు వెయిటింగ్ తప్పడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రిటైర్అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని అర్హతలతో దశాబ్దాలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అవుతున్నారు. ఖాళీలు ఉన్నా మోక్షం లేదు.
విద్యుత్సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏండ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ఇన్ చార్జీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. సదరన్ డిస్కం పరిధిలో మూడు సీజీఎం పోస్టులు గత ఏడున్నర ఏండ్లుగా ఖాళీగా ఉన్నాయి. రెండు టెక్నికల్ పోస్టులతో పాటు ఒక అకౌంట్స్ పోస్ట్, ఐదు సూపరింటెండెంట్ పోస్టులు,13 డీఈ పోస్టులు, 28 ఏడీఈ పోస్టులు, 40 వరకు ఏవో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇలా డిస్కంలో ఖాళీగా ఉన్న వాటి స్థానంలో అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు కల్పించాల్సి ఉంది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఈ అంశాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.
కోర్టు కేసుల పేరుతో జాప్యం
ప్రమోషన్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నా కోర్టు కేసుల పేరుతో గత సర్కార్ జాప్యం చేసిందని విమర్శలు ఉన్నాయి. ప్రమోషన్ల విషయంలో బీసీ, ఓసీలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మెరిట్ కమ్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అప్పటి విద్యుత్ సంస్థల పెద్దలు అమలు చేయలేదు. దాంతో బీసీ, ఓసీ అసోసియేషన్స్ కోర్టు ధిక్కారం కింద పిటిషన్ వేశాయి. అప్పటి నుంచి రెండేండ్లుగా ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది.
మీరైనా గోడు వినండి
కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోకి రాని వారికి, అవసరమైతే రివర్షన్ ఇస్తామనే కండిషన్ తోనైనా ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రిటైర్మెంట్ అయ్యేలోగా రివర్షన్ ఆర్డర్స్ ఇస్తే వెనక్కి వస్తామని చెబుతున్నారు. అన్ని అర్హతలు ఉన్న వారికి ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని..అందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రిక్వెస్ట్ చేశాయి.