సెక్రటేరియెట్ వద్ద ఎంప్లాయీస్ సంబురాలు

సెక్రటేరియెట్ వద్ద ఎంప్లాయీస్ సంబురాలు

హైదరాబాద్​, వెలుగు :  రేవంత్ రెడ్డి​ముఖ్యమంత్రిగా గురువారం కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడంతో సెక్రటేరియెట్​ సౌత్​ గేట్​ దగ్గర బుధవారం ఎంప్లాయీస్​సంబురాలు చేసుకున్నారు. పటాకులు పేల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. ఉద్యోగుల సంబురాలు చూస్తుంటే గత ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో అణచివేత ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ఇలాంటి అణచివేత ఉండబట్టే తెలంగాణ ప్రజలు ఒక్కటై కేసీఆర్​ను ఓడించారని కోదండరాం పేర్కొన్నారు. 

ఉద్యోగ సంఘాల నేతలతోనే ఉద్యోగుల హక్కులను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం హరించిందని ఆయన ఫైర్​ అయ్యారు.  సంఘాలు ఉద్యోగుల మీద జూలు విదల్చడానికి ఉండకూడదని.. వారి హక్కులను సంరక్షించేవిగా ఉండాలని తెలిపారు.  ఇక ప్రజల తెలంగాణ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాల్‌‌‌‌లో మాట్లాడుకునేవారని, ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని, ఫోన్ సంభాషణల మీద నిఘా పోయిందన్నారు. 

తాను ప్రభుత్వానికి.. ఉద్యోగులకు వారధిగా ఉంటానని కోదండరాం అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. కొందరు సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా కొందరు తమను అణచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్​ లేకుండా ఏకపక్షంగా సెక్రటేరియెట్​ ఎంప్లాయీస్​ యూనియన్​ ఏర్పాటు చేసుకుని పెత్తనం చేశారన్నారు. ఇక కాంగ్రెస్​ ప్రభుత్వంలో తమ సమస్యలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.