రెవెన్యూలో శాఖలో ప్రమోషన్లు రాక ఉద్యోగులు సతమతం

రెవెన్యూలో శాఖలో ప్రమోషన్లు రాక ఉద్యోగులు సతమతం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా మరిచింది. వీఆర్ఏల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు రెవెన్యూ ఉద్యోగులంతా ఒక్కో కేడర్ లో ఒక్కో సమస్యతో సతమతమవుతుంటే సర్కార్ పట్టించుకోవడం లేదు. వీఆర్ ఏలకు పే స్కేల్, వీఆర్వోలకు జాబ్ చార్ట్, తహసీల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు లాంటి అనేక ఇష్యూస్ నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంటున్నాయి. రెవెన్యూ శాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉండటం, రెవెన్యూ శాఖకు కీలకమైన సీసీఎల్ఏ బాధ్యతల్లో సీఎస్ సోమేష్ కుమార్ ఉండటంతో ఉద్యోగ సంఘాలకు వారి అపాయింట్ మెంట్ దొరకడమే గగనమైపోయింది. అనధికారికంగా డీఆర్వో పోస్టు రద్దయిపోవడంతో జిల్లా స్థాయిలోనూ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. 

నిలిచిపోయిన ప్రమోషన్లు.. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. సీఎస్ పరిధిలోని రెవెన్యూ శాఖలో మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. కేవలం ఐదు, ఆరో జోన్ పరిధిలోని 176 మంది డీటీలకు మాత్రమే తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించి అధికారులు చేతులు దులుపుకున్నారు. సీనియార్టీ ఉన్న తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడం, వారికి ఇప్పటి వరకు ఎలాంటి డెజిగ్నేషన్ కేటాయించకపోవడంతో సీనియార్టీ ఉన్న సుమారు 700 మంది వీఆర్వోలకు ప్రమోషన్లు దక్కడం లేదు. 2012లో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల్లోనూ చాలా మంది డిపార్ట్​మెంటల్ టెస్టులు పాసై వీఆర్వో ప్రమోషన్ కు అర్హత సాధించారు. కానీ వీఆర్వో వ్యవస్థ రద్దుతో వారి ప్రమోషన్ ఛానల్ కు బ్రేక్ పడింది. సీనియార్టీ ఉన్న సుమారు 2 వేల మంది వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తే ఏ పోస్టు ఇవ్వాలనే విషయంలో అధికారుల్లో గందరగోళం నెలకొంది. సీనియార్టీ ఉన్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా డిప్యూటీ తహసీల్దార్ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 

వీఆర్ఏలకు అందని పే స్కేల్ 

రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో డ్యూటీ చేస్తున్న 22 వేల మంది వీఆర్ఏల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో సీఎం హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్ ఇవ్వకుండా రూ.6,500 వేతనాన్ని రూ.10,500కు పెంచారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020 సెప్టెంబర్ లో వీఆర్వో వ్యవస్థ  రద్దుపై అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. కానీ 10 నెలలు దాటినా ఆ హామీ నెరవేరలేదు. 

తేలని వీఆర్వోల భవితవ్యం.. 

నిరుడు సెప్టెంబర్ 7న కొత్త రెవెన్యూ చట్టంతోపాటు వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు, పంపిణీ చేయని పాస్ బుక్స్ ను అధికారులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగి 10 నెలలు దాటినా ఇప్పటి వరకు వారి డ్యూటీకి సంబంధించిన జాబ్ చార్ట్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. నెలనెలా వేతనాలు ఇస్తున్నప్పటికీ.. వారు ఏం పని చేయాలో మాత్రం చెప్పలేదు. దీంతో తహసీల్దార్లు స్థానిక అవసరాల మేరకు వారిని వాడేస్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఇంకా భూసంబంధిత పనులనే అప్పగిస్తున్నారు. 

వీఆర్వోలకు జాబ్ చార్ట్ డిక్లేర్ చేయాలి 

భూరికార్డుల ప్రక్షాళన చేసి పట్టాదారు పాస్ బుక్స్ ఇవ్వడంలో వీఆర్వోలదే కీలక పాత్ర. అలా చేశాకే రైతుబంధులాంటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయగలుగుతోంది. కానీ వీఆర్వోలంతా అవినీతిపరులే అని ముద్ర వేసి వ్యవస్థనే రద్దు చేశారు. కరోనా టైంలోనే సుమారు 70 మంది వీఆర్వోలు చనిపోయారు. వాళ్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇతర శాఖలకు వెళ్లే వీఆర్వోలకు ఆప్షన్లు ఇవ్వాలి. మిగిలినవారిని శాఖలోనే సర్దుబాటు చేయాలి. ఇప్పటికైనా మాకు జాబ్ చార్ట్ ప్రకటించాలి. మా సమస్యలను చెప్పుకుందామంటే సీఎంగానీ, సీఎస్ గానీ ఒక్కసారి కూడా అపాయింట్ ఇవ్వడం లేదు. 
–హరాలే సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీఆర్వోల సంక్షేమం సంఘం

20న కార్యాచరణ ప్రకటిస్తాం

వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తమని 2017లో, 2020 సెప్టెంబర్ లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో మాకు ప్రమోషన్ ఛానల్ లేకుండా పోయింది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్ వీఆర్ఏల్లో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు. తహసీల్దార్ వరకు ప్రమోషన్ పొందేలా అన్ని డిపార్ట్​మెంటల్ టెస్టులు కూడా పాసై ఉన్నాం. పే స్కేల్ వర్తింపు కంటే భవిష్యత్ లో ప్రమోషన్లు ఎలా అన్న బెంగే ఎక్కువగా ఉంది. మా సమస్యల సాధనకు ఈ నెల 20న కార్యాచరణ ప్రకటిస్తాం. –రమేష్ బహదూర్, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు