
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని సీఎస్ రామకృష్ణారావును ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈహెచ్ఎస్ లేకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, హాస్పిటల్స్ బిల్స్ కడితే, మళ్లీ రావడం లేదని జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావులు సీఎస్ కు తెలిపారు. ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వెంటనే డీఏను విడుదల చేయాలని కోరారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు రాష్ర్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలపై సీఎస్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఈహెచ్ ఎస్ పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. సీఎస్ ను కలిసిన వారిలో ముజీబ్, కస్తూరి వెంకటేశ్వర్లు, వంగ రవీందర్ రెడ్డి, సదానందం గౌడ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.