సూపర్ మాక్స్ కార్మికులను ఆదుకోవాలి.. 15 నెలలుగాజీతాల్లేక ఇబ్బంది పడుతున్నం

సూపర్ మాక్స్ కార్మికులను ఆదుకోవాలి.. 15 నెలలుగాజీతాల్లేక ఇబ్బంది పడుతున్నం

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోరేదైతే వెంటనే సూపర్ మాక్స్ కార్మికులను ఆదుకోవాలని ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 1,000 మందితో నడుస్తున్న సూపర్ మాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను  బంద్ చేస్తే పదివేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. కంపెనీని ఓపెన్ చేయించాలని, కార్మికులను ఆదుకోవాలని కొన్ని నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా  ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. 

సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు వి శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, పెద్దిరెడ్డి, శ్రీనివాసరావు, ఈశ్వరరావు, లక్ష్మారెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీ మూతపడడం, దీంతో 15 నెలలుగా జీతాలు  లేక ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్ మెంట్ వైఖరిలో ఎలాంటి మార్పు రావడంలేదని  ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కార్మిక కుటుంబాలను న్యాయం చేయాలని కోరారు.