సీఎం రాకను స్వాగతిస్తూ..ఓయూలో మహార్యాలీ

సీఎం రాకను స్వాగతిస్తూ..ఓయూలో మహార్యాలీ
  • ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్‌‌సీసీ గేట్ వరకు నిర్వహణ

ఓయూ, వెలుగు:  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం టీచర్లు తెలిపారు. సీఎం పర్యటనను హర్షిస్తూ, తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్‌‌సీసీ గేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలపై నిర్లక్ష్యం చూపి, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 820 మంది పార్ట్ టైమ్ టీచర్లు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని, పార్ట్ టైమ్ నుంచి కాంట్రాక్టు వ్యవస్థకు మార్చాలని, నాన్ టీచింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.

 మాలల భవిష్యత్​పై స్పష్టమైన ప్రకటన చేయాలి

క్యాంపస్​లో చదువుతున్న అన్ని మాల విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ రాహుల్ రావు డిమాండ్ చేశారు. సీఎం ఓయూకు రానున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు పెండింగ్‌‌లో ఉండడంతో మాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు నష్టపోతున్నారని ఆరోపించారు. మాల విద్యార్థుల భవిష్యత్తుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ఆయన ఓయూ పర్యటనను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.

 ఓయూ సమస్యలు పరిష్కరించాలి

 ఓయూ సమగ్ర అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించి, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను హర్షిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ తెలిపారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన మాట్లాడారు.

 ఓయూ నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.  ఓయూ భూములకు రక్షణ కల్పించాలని, పరిశోధన విద్యార్థులకు నెలకు రూ.20 వేలు, ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.5 వేల ఫెలోషిప్, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. జాబ్ క్యాలెండర్ స్పష్టత ఇచ్చి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తమ డిమాండ్లను సీఎం దృష్టికి  తీసుకెళ్తామన్నారు.