‘ఉపాధి’ సిబ్బందికి జీతం తిప్పలు..మూడు నెలలుగా వేతనాలు పెండింగ్

‘ఉపాధి’ సిబ్బందికి జీతం తిప్పలు..మూడు నెలలుగా వేతనాలు పెండింగ్
  • రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మంది ఉద్యోగులు, సిబ్బంది
  • ఆర్థిక ఇబ్బందులతో సతమతం

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బందికి సకాలంలో జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయి, కరెంట్‌‌‌‌ బిల్లు, ఈఎంఐలు, ఇంటి అవసరాలకు డబ్బులు ఉండటం లేదు. ఆఫీసుకు వెళ్లేందుకు బైక్​లో పెట్రోల్‌‌‌‌ కోసం, ఆటో చార్జీలకు వేరేవాళ్ల దగ్గర అప్పు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అడిగితే, రేపు.. మాపు అంటూ ఉన్నతాధికారులు కాలం వెల్లదీస్తున్నారే తప్ప.. తమ కష్టాలు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పథకంలో దాదాపు 13వేల మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. 7,471 మంది ఫీల్డ్ అసిసెంట్లు, 400కు పైగా ఏపీవోలు, 2,150 మంది టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ), 850 మంది కంప్యూటర్, అకౌంట్స్ ఆపరేటర్లు, 340 ఈసీలు, 550 మంది అటెండర్లు ఉన్నారు. వీరికి ఇంకా మండలాలు, జిల్లా కేంద్రంలో ఉపాధి సిబ్బందితో పాటు సాట్ (సొసైటీ ఫర్ సోషల్​ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్​ ట్రాన్స్​పరెన్సీ)లో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరితో పాటు కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొనసాగుతున్నారు. వీరికి 3 నెలలుగా వేతనాలు రావడం లేదు. గతంలో కూడా 3 నెలలు వరకు జీతాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో శాలరీలు పే చేశారు. మళ్లీ అదే పరిస్థితి ఎదురుకావడంతో ఇటీవల ఉపాధి హామీ జేఏసీ ఉద్యోగులు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి విన్నవించగా.. వారం రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. డబ్బులు అందలేదని ఉద్యోగ సంఘం నాయకులు అంటున్నారు.

ఆర్థికశాఖలో పెండింగ్

కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. నెలల తరబడి ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉంటున్నాయని సమాచారం. ఉపాధి, సామాజిక తనిఖీ వేదిక సిబ్బంది జీతాల కోసం గత నెల 17న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.5.14 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ కూడా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా టోకెన్ జనరేట్​ చేయకపోవడంతో పెండింగ్​లో ఉంటున్నాయని తెలిసింది. దీంతో జీతాల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతున్నదని సమాచారం. 

‘స్పర్శ’ ద్వారా వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా జాప్యం జరుగుతున్నదని వివరించారు. ఒకట్రెండు రోజుల్లో వేతనాలు అకౌంట్లలో జమ అవుతాయని పేర్కొన్నారు.