- 60:40 నిష్పత్తితో పథకం అమలు కష్టం
- స్కీమ్ ను నిర్వీర్యంచేసేందుకే ఏకపక్ష నిర్ణయాలు
- ఉపాధి హామీ పథకంరాష్ట్ర ఉద్యోగుల జేఏసీ
- సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనిమంత్రి సీతక్కకు వినతి
హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఉపాధి హామీ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏలబద్రి లింగయ్య తెలిపారు. శనివారం హైదరబాద్ సెక్రటేరియట్లో జేఏసీ ప్రతినిధి బృందం మంత్రి సీతక్కను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందన్నారు.
కూలీలకు హామీ ఉన్న ఉపాధి, వేతన భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టంలోని నిధుల పంపిణీ విధానంలో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపే ప్రతిపాదన అమలు సాధ్యం కాదని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఇది భారం అవుతుందన్నారు.
ఇప్పటివరకు కేంద్రం అధిక భాగం వ్యయం భరించగా, ఇప్పుడు 60:40 నిష్పత్తి విధించడంతో పథకం అమలు కష్టం అవుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపి, రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు రావడం లేదని ఎలబద్రి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలను నెలనెలా క్రమం తప్పకుండా ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ర్ట జేఏసీ కోచైర్మన్లు ఏపీవోల గౌరవాధ్యక్షుడు మోహన్‌రావు, అధ్యక్షుడు అంజిరెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రాష్ర్ట అధ్యక్షుడు రాజశేఖర్, కంప్యూటర్ అండ్ అకౌంట్ అసిస్టెంట్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మురహరి విజయకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
