రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పని దినాల టార్గెట్ పూర్తి

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పని దినాల టార్గెట్ పూర్తి
  • పనులు దొర్కుడు కష్టమే 
  • ఇప్పటిదాకా 12.92  కోట్ల 
  • పని దినాలు పూర్తి  
  • 13 కోట్ల పని దినాల్లో 
  • మిగిలింది 7.80 లక్షలే     
  • రాష్ట్రంలో కనీస వేతనానికి నోచుకోని కూలీలు    

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పని దినాల టార్గెట్ పూర్తి కావొచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మార్చి నెలఖారుకు ఉపాధి హామీ కూలీలకు13 కోట్ల పని దినాలు కల్పించాలని టార్గెట్‌‌గా పెట్టుకోగా 2021 డిసెంబర్ 31 వరకే 12 కోట్ల 92 లక్షల పని దినాలు పూర్తయ్యాయి. మరో 3 నెలలు ఉండగానే.. పర్సన్ డేస్ పూర్తి కావొస్తుండడంతో మిగిలిన రోజులు పని కల్పిస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంతో అదనపు నిధులు వస్తే గానీ కొత్త పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపితేనే కొత్త పనులు వచ్చే అవకాశం ఉంటుంది.  

మిగిలినవి రూ. 315 కోట్లే.. 
కేంద్ర ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ఆర్ఈజీఎస్ పనుల కోసం రూ.3,861.04 కోట్లు కేటాయించింది.  ఇప్పటికే రూ.3,546 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కూలీల వేతనాల కోసం రూ.2,113 కోట్లు చెల్లించగా, మెటీరియల్ వర్క్స్, స్కిల్డ్ వేజేస్‌‌కు 1,318 కోట్లు వెచ్చించింది. మరో రూ.315 కోట్లు ఖర్చు పెట్టడానికి చాన్స్ ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,93,089 పనులు పూర్తి కాగా, మరో 5 లక్షల పనులు కొనసాగుతున్నాయి. 

పనులు కష్టమే.. 
డిసెంబర్ చివరి వరకు 12 కోట్ల పర్సన్ డేస్ టార్గెట్ కాగా, అదనంగా మరో 92 లక్షల పని దినాలు చేయించారు. 7 లక్షల 80 వేల పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో ఇవి కూడా కంప్లీట్ కానున్నాయి. ఆ తర్వాత పనులు కల్పించడంపై సందిగ్ధం నెలకొంది. గతంలో గ్రామంలో రోజుకు 25 నుంచి 50 మందికి తప్పనిసరిగా పనులు కల్పించాలని సెక్రటరీలకు టార్గెట్ ఇచ్చిన పంచాయతీరాజ్ అధికారులు కొద్ది రోజులుగా ఆ ఊసెత్తడం లేదు. పనులు కల్పించాక కూలీలకు కూలి పైసలు రాకపోతే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే ఎక్కువగా ఫోర్స్ చేయడం లేదని తెలిసింది.  

కూలి గిట్టుత లేదు.. 
రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు కనీస వేతనానికి నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ లో రోజువారీ కూలిని రూ.237 నుంచి రూ.245కు పెంచింది. కానీ మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సగటును రోజు కూలి రూ.169.95 మాత్రమే అందుతోంది. కనీస కూలి కన్నా రూ.75 తక్కువగా ఇక్కడి కూలీలు పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలతో పోలిస్తే మన రాష్ట్రంలోని ఉపాధి కూలీలే అతి తక్కువ వేతనం పొందుతున్నారు. అత్యధికంగా హర్యానాలో యావరేజ్ గా రూ.308.29, కేరళలో రూ.294.65, గోవాలో రూ.280.24 కనీస వేతనం అందుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కూలీలు రోజువారీ కూలి 228.74 పొందుతున్నారు.