ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి

ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి
  •     ముగ్గురికి తీవ్ర గాయాలు
  •     అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలో శుక్రవారం ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలపై బండరాయి పడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని పెద్దమ్మ కుంటలో ఒకే చోట కూలీ లతో లోతుగా మట్టి పూడికతీత పనులు చేయిస్తుండగా మీద ఉన్న బండరాయి పడింది. దీంతో బుర్ర స్వరూప, అవునూరి తార, కల్వల లింగమ్మ తీవ్రంగా గాయపడ్డారు. బండరాయి కూలీల పైనుంచి వెళ్లి అక్కడున్న ఓ ట్రాక్టర్​ను ఢీకొని ఆగిపోయింది. దీంతో మిగతావారికి ప్రాణాపాయం తప్పింది. 

నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు పూడికతీత పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. గాయపడిన కూలీలను పంచాయతీ కార్యదర్శి గాని, ఉపాధి హామీ సిబ్బంది గాని దవాఖానకు తరలించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో కుటుంబసభ్యులే వారిని వాహనాల్లో సుల్తానాబాద్ దవాఖానకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో దివ్యదర్శన్ రావు తెలిపారు.