తెలంగాణలో మహిళలు బలోపేతం..ఆర్టీసీ బస్సులతో.. అతివల ప్రగతి బాట

తెలంగాణలో మహిళలు బలోపేతం..ఆర్టీసీ బస్సులతో..  అతివల ప్రగతి బాట
  • మహిళా సమాఖ్యల ద్వారా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తున్న సర్కార్‌‌
  • రాష్ట్ర వ్యాప్తంగా 553 మండల సమాఖ్యలకు 600 బస్సులు కొనాలని నిర్ణయం
  • తొలి విడతలో 151 బస్సులు అందజేత, దసరా నాటికి మిగిలినవి ఇవ్వాలని ప్లాన్‌‌
  • ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చెల్లిస్తున్న ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌‌ కింద మహిళల స్వయం ఉపాధికి బాటలు వేయడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సెర్ప్ ద్వారా లోన్లు అందజేస్తోంది. 

వీటితో పాటు మహిళా క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్‌‌ ప్లాంట్లు, పెట్రోల్‌‌ బంక్‌‌లు, గోదాముల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్న ప్రభుత్వం.. మహిళా సంఘాల చేత బస్సులను సైతం కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తోంది. దీని ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం రావడంతో పాటు బస్సుల కొరత సైతం తీరుతోంది. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రులు సీతక్క, సురేఖ కలిసి.. మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. 

తొలి విడుతలో 151 మండల సమాఖ్యలకు బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా 553 మండల సమాఖ్యలు ఉండగా.. 600 బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. తొలి విడతలో 17 జిల్లాల్లో 151 మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఇప్పటికే బస్సులు కొనుగోలు చేసి వివిధ డిపోలకు అందజేసింది. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు అవసరం కాగా... సెర్ప్‌‌ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌ నుంచి రూ.30 లక్షలు, మండల సమాఖ్యల నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం 151 బస్సుల కొనుగోలుకు రూ.54.36 కోట్లను సెర్ప్, మండల సమాఖ్యలే సమకూర్చాయి. రెండు, మూడు విడతల్లో మరో 449 బస్సులు కొనుగోలు చేసేందుకు సెర్ప్‌‌ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దసరా నాటికి బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468

బస్సులను ఆర్టీసీకి ఏడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చేందుకు సెర్ప్, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ బస్సులను మండల సమాఖ్యల పేరుపైనే హైపోథికేషన్‌‌ చేశారు. ఒక్కో బస్సుకు అద్దె కింద నెలకు రూ. 69,468లను ఆర్టీసీ మండల సమాఖ్యలకు చెల్లించనుంది. మొత్తం 151 బస్సుల ద్వారా నెలకు రూ.1.04 కోట్ల ఆదాయం వస్తోంది. జూన్‌‌, జూలై నెలలకు సంబంధించిన రూ.2.80 కోట్ల అద్దెను ఇప్పటికే సమాఖ్యలకు అందించింది. బస్సు డ్రైవర్‌‌, కండక్టర్లతో పాటు డీజిల్‌‌, నిర్వహణ ఖర్చులను సైతం సంస్థే భరిస్తుండడంతో మహిళా సమాఖ్యలకు ఆర్థిక భారం తగ్గుతోంది. ఏడేళ్ల పాటు అద్దె చెల్లించిన తర్వాత బస్సులు ఆర్టీసీ సొంతం కానున్నాయి. 

మహాలక్ష్మి స్కీమ్‌‌కు తీరిన బస్సుల కొరత 

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి.. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ క్రమంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల కొరత ఏర్పడింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం ఆర్టీసీకి భారంగా మారింది. ఈ క్రమంలో మహిళా సంఘాల అద్దె బస్సుల వినియోగంతో బస్సుల కొరత తీరినట్లైంది. ప్రైవేట్‌‌ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే బదులు మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను తీసుకుంటుండటంతో ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సంఘాలకు మేలు కలుగుతోంది.

బస్సు ద్వారా స్థిర ఆదాయం 

బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో మా శ్రీచైతన్య మండల సమాఖ్యకు నెలకు సగటున రూ.70 వేల ఆదాయం సమకూరుతోంది. బస్సుల కొనుగోలు వల్ల మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కలుగుతోంది. బస్సు అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. 

- ఉయ్యాల రజిత, శ్రీచైతన్య మండల సమాఖ్య అధ్యక్షురాలు, ధర్మపురి, జగిత్యాల జిల్లా-

బస్సు ఓనర్ అయినందుకు గర్వంగా ఉంది 

మా వనపర్తి జిల్లాలో 12 మండల సమాఖ్యలు బస్సులు కొనుగోలు చేశాయి. ఒకేసారి రూ.36 లక్షలతో బస్సు కొని అద్దెకు ఇస్తామని కలలో కూడా అనుకోలేదు. మా మండల మహిళా సమాఖ్య ఆర్టీసీ బస్‌‌ ఓనర్‌‌ అయిందని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆర్టీసీ నుంచి మండల మహిళా సమాఖ్యకు ప్రతినెల రూ.50 వేలు అసలు, రూ.19,468 వడ్డీ కలిపి మొత్తం రూ.69,468  వస్తున్నాయి. 
- స్వరూప, పెద్దమందడి మండల మహిళా సమాఖ్య, వనపర్తి జిల్లా-

ఆదాయం పెరిగింది 

మా చైతన్య మండల సమాఖ్య తరఫున బస్సును కొని ఆర్టీసికి ఇవ్వడం ద్వారా అద్దె రూపంలో రెండు నెలల్లో రూ.1,39,296  వచ్చాయి. ఆర్టీసీ ద్వారా వచ్చే అద్దెతో పాటు లోన్లు తీసుకున్నవారు చెల్లించే వడ్డీతో ఆదాయం పెరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 37 స్వయం సహాయక మహిళ సంఘాలుండగా.. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళలకు వ్యాపారాల కోసం లోన్లుగా ఇస్తున్నాం.
- పత్తెం పద్మ, బండ రమాదేవి, చైతన్య మండల సమాఖ్య అధ్యక్షకార్యదర్శులు, ములుగు జిల్లా-

మా బస్సును మంథని డిపోకు అద్దెకిచ్చాం 

మా మండల సమాఖ్య ఆధ్వర్యంలో బస్సు కొని మంథని డిపోకు అద్దెకిచ్చాం. జూన్ నెలకు సంబంధించిన రూ. 69,468 మండల సమాఖ్య ఖాతాలో జమ అయ్యాయి. బస్సు అద్దె రూపంలో ఆదాయం వస్తుండడంతో ఆర్థిక భరోసా కలిగింది. ప్రభుత్వ నిర్ణయంతో మహిళల ఆత్మ గౌరవం, విశ్వాసం మరింత పెరిగాయి. భవిష్యత్‌‌లో మరిన్ని వ్యాపారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- నూగిళ్ల అనూష, రాజరాజేశ్వర మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, సుల్తానాబాద్‌‌, పెద్దపల్లి జిల్లా-