ఓవర్ ఫ్లో కొంప ముంచింది.. గోపాలపూర్ ఊరచెరువు ఓవర్ ఫ్లో కావడంతో హనుమకొండలో ముంపు

ఓవర్ ఫ్లో కొంప ముంచింది.. గోపాలపూర్ ఊరచెరువు ఓవర్ ఫ్లో కావడంతో హనుమకొండలో ముంపు
  • చెరువు చుట్టూ కబ్జాలు, సిల్ట్ పేరుకుపోవడంతో బయటకు తన్నుకొచ్చిన వరద
  • కట్ట కోతకు గురై కాలనీలను ముంచెత్తిన నీళ్లు
  • రూ.2.45 కోట్లతో ప్రపోజల్స్ పెట్టినా పట్టించుకోని గత పాలకులు
  • ఏండ్లు గడుస్తున్నా మారని కాకతీయుల కాలంనాటి చెరువు తీరు

హనుమకొండ, వెలుగు: మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డుతోపాటు చుట్టుపక్కల పది కాలనీలు ముంపునకు గురై నష్టం వాటిల్లింది. వందలాది వాహనాలు కొట్టుకుపోగా, జనాలు ఇండ్లు వదిలి బయటకు వెళ్లారు. పక్కనే ఉన్న గోపాలపూర్ ఊరచెరువు ఓవర్ ఫ్లో కావడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాగా, దాని చుట్టూ ఉన్న ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, గుర్రపుడెక్క స్పిల్ వేకు అడ్డుపడటం వల్లే వరద బయటకు తన్నుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి చెరువులో పూడికతీత, కట్టను బలోపేతం చేస్తే చాలావరకు తీవ్రత తగ్గేదే. కానీ, చెరువు అభివృద్ధికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం, ఏండ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథులే లేకపోవడంతో గోపాలపూర్ ఊరచెరువు ఇప్పుడు వరదలకు కారణమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సగానికిపైగా చెరువు కబ్జా.!

1954 సేత్వార్ రికార్డు ప్రకారం గోపాలపూర్ ఊరచెరువు సర్వే నంబర్ 89లో దాదాపు 23.10 ఎకరాల మేర విస్తరించి ఉండేది. ప్రస్తుత రికార్డుల ప్రకారం 20.01 ఎకరాలు ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటీ క్షేత్రస్థాయిలో చాలావరకు కబ్జాలు జరిగాయి. చెరువుకు హద్దులు నిర్ణయించకపోవడం, ఇక్కడ గజం స్థలం విలువ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతుండటంతో ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే పదెకరాలకు పైగా కబ్జా కాగా, సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురైనట్లు అంచనా.

ఓవర్ ఫ్లోతోనే ముప్పు..

గోపాలపూర్ ఊరచెరువు ఆక్రమణకు గురై చుట్టూ బిల్డింగులు ఏర్పడటం, అందులోనే సబ్ స్టేషన్, సమాధులు నిర్మించడంతో దాని విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దశాబ్ధాల నుంచి పూడికతీయకపోవడం, గుర్రపుడెక్క, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో కొద్దిపాటి వర్షం పడినా చెరువు నిండుతోంది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు పైనుంచి పెద్దఎత్తున వరద రావడంతో చెరువు ఓవర్ ఫ్లో అయ్యింది. కట్ట ఐదారు చోట్ల కోతకు గురై దాని కిందివైపున్న అమరావతి నగర్, వివేక్ నగర్ కాలనీ, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్ ముంపు బారిన పడ్డాయి. ఒకవేళ కోతకు గురైన కట్ట పూర్తిగా తెగితే పెను విధ్వంసమే జరిగేది.

అభివృద్ధి చేస్తామన్న లీడర్లు..

కాకతీయుల కాలంనాటి గోపాలపూర్ ఊరచెరువు కేయూ-ఫాతిమా నగర్ వంద ఫీట్ల రోడ్డును ఆనుకుని ఉండటంతో దీనిని డెవలప్ చేస్తామని గతంలో ఒక్కో లీడర్ ఒక్కో రకంగా హామీలిచ్చారు. ఈ మేరకు శిలాఫలకాలు కూడా వేశారు. కానీ, అందులో ఏ ఒక్క పని పట్టాలెక్కలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1998 డిసెంబర్ లో ఈ చెరువును 'సరోవర విహార మాలిక'గా అభివృద్ధి చేస్తామని శిలాఫలకం వేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ.2.45 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2021లో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముందు గోపాలపూర్ ఊరచెరువు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. దీంతో చెరువును పట్టించుకునే నాథులు లేక అందులో చెత్తాచెదారం, గుర్రపుడెక్క పేరుకుపోయి, కట్ట కూడా బలహీనంగా మారింది.

డెవలప్ చేస్తేనే మేలు..

గోపాలపూర్ ఊరచెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించి, గుర్రపుడెక్క, డీసిల్టేషన్ పనులు చేపడితే దాని కెపాసిటీ పెరుగుతుంది. చుట్టుపక్కల కాలనీలకు ముంపు సమస్య కూడా తీరుతుంది. కట్టను బలోపేతం చేసి బ్యూటిఫికేషన్ వర్క్స్ చేస్తే వంద ఫీట్ల రోడ్డును ఆనుకుని మినీ ట్యాంక్ బండ్ గా టూరిస్టులు, పర్యావరణ ప్రేమికులను కనువిందు చేస్తుంది. కానీ, ఆ దిశగా చర్యలు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు గోపాలపూర్ ఊరచెరువులో కబ్జాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని, ముంపు సమస్యలు తలెత్తకుండా బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.