హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత

హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత

చండీగఢ్: మూడు సార్లు ఒలింపిక్ మెడల్స్ విజేత, ఇండియా హాకీ లెజెండ్ ప్లేయర్ బల్బీర్ సింగ్(96) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో గత రెండు వారాలుగా మొహాలిలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8 న బల్బీర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, వారం రోజుల నుంచి సెమీ కోమా స్థితిలో వెంటిలేటర్ పై ఉండగా.. ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఆరోగ్యం విషమించడంతో చనిపోయారని మొహాలిలోని ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు.

చెక్కు చెదరని రికార్డు
ఒలింపిక్స్ లో మూడు సార్లు ఇండియాకు గోల్డ్ మెడల్స్ అందించిన బల్బీర్ సింగ్.. ఆధునిక ఒలింపిక్ చరిత్రలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్ సింగ్ ఒకరు. ఈ ఘనత సాధించిన అత్యంత నిష్ణాతులైన ఏకైక ఇండియన్ అథ్లెట్​గా ఆయన గుర్తింపు పొందారు. ఒలింపిక్స్ హాకీ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత గోల్స్ లో బల్బీర్ సింగ్ ప్రపంచ రికార్డు ఇప్పటికీ అజేయంగా ఉంది.1952 హెల్సింకి గేమ్స్‌లో నెదర్లాండ్స్‌ తో ఆడిన మ్యాచ్​లో 5 గోల్స్ చేశారు. ఆ రికార్డు ఇప్పటికీ ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. లండన్ (1948), హెల్సింకి (1952), మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్ లో బల్బీర్ ఆధ్వర్యంలో ఇండియాకు గోల్డ్ మెడల్స్ దక్కాయి. 1948 లండన్ మ్యాచ్ లో బల్బీర్ సీనియర్ గా, 52 లో వైస్ కెప్టెన్ గా, 56 గేమ్స్ లో ఆయన కెప్టెన్సీలో ఇండియా హాకీ టీమ్ విజయాలు సాధించింది. ‘బల్బీర్ సింగ్ సీనియర్’ అని అతడ్ని అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. ఆయన ఘనతలకి మెచ్చిన ఇండియన్ గవర్నమెంట్ 1957లో పద్మశ్రీతో గౌరవించింది.

మోస్ట్ ఫేవరెట్ హాకీ స్టార్ గా గుర్తింపు
పంజాబ్‌లోని హరిపూర్ ఖల్సా గ్రామంలో 1924 జన్మించిన బల్బీర్ సింగ్​కు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు, కూతురు సుష్బీర్ సింగ్, మనవడు కబీర్ సింగ్​లతో కలిసి సింగ్ ఇక్కడే నివాసం ఉన్నారు. ముగ్గురు కొడుకులు కన్వల్​బీర్, కరణ్ బీర్, గురుబీర్ సింగ్ కెనడాలో స్థిరపడ్డారు. నైపుణ్యాలలో మేజర్ ధ్యాన్ చంద్‌తో సమానంగా పరిగణించబడుతున్న బల్బీర్ సింగ్ స్వతంత్ర భారతదేశపు అతిపెద్ద హాకీ స్టార్​లలో ఒకరిగా గుర్తింపు పొందారు. బల్బీర్ ను భారత రత్న తో సత్కరించాలని గత కొన్నేళ్లుగా పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.