గుజరాత్​లో న్యాయ్​ యాత్ర ముగింపు

గుజరాత్​లో న్యాయ్​ యాత్ర ముగింపు
  •       చివరిరోజు స్వరాజ్​ ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్​ గాంధీ
  •     సర్దార్​ వల్లభాయ్​ పటేల్​కు కాంగ్రెస్​ అగ్రనేత ఘన నివాళి

తాపి: రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో న్యాయ్​ యాత్ర ఆదివారంతో గుజరాత్​లో ముగిసింది. నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో యాత్ర కొనసాగింది.  దాదాపు 400 కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించారు. చివరిరోజు రాహుల్​గాంధీ సూరత్​లోని స్వరాజ్​ ఆశ్రమాన్ని సందర్శించారు. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​కు ఘన నివాళి అర్పించారు.   ఒకరోజు విరామం తర్వాత మంగళవారం నుంచి మహారాష్ట్రలోని నందుర్బర్​లో యాత్ర ప్రారంభం కానున్నదని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్​ మీడియాతో వెల్లడించారు.

ఇది స్ఫూర్తిదాయక క్షణం: జైరాం రమేశ్​

‘1922లో సర్దార్ వల్లభాయ్ నెలకొల్పిన స్వరాజ్​ నివాస్​ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఢిల్లీ–హర్యానా సరిహద్దుల్లో న్యాయంకోసం వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భారత్​ జోడో న్యాయ్ యాత్రకు ఇది స్ఫూర్తిదాయకమైన క్షణం’ అని జైరాం రమేశ్​ పేర్కొన్నారు. ‘మేం ఆర్​ఎస్​ఎస్​ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దీన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తాం. మా భావజాల బలోపేతానికి కాంగ్రెస్​ పార్టీకి రాహుల్ ​గాంధీ ఓ మార్గాన్ని చూపారు. దీన్ని మేం ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ ​గాంధీ గుజరాత్​లో యాత్ర ముగిసిన తర్వాత తాపీ జిల్లాలోని వ్యారా జిల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.