హైదరాబాద్ సిటీ, వెలుగు: భారతీయ జాతులకు చెందిన కుక్కలు అంతరించిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని క్విక్ రన్ బ్యాగ్ సంస్థ ప్రతినిధులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశీ పెట్ డాగ్స్‌కు బదులుగా స్థానిక బ్రీడ్స్‌ను ఎంచుకోవాలని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు కల్యాణి ప్రసాద్, సింధూజ మాట్లాడారు.
భారతదేశంలోని వేడి, తేమ వంటి వాతావరణ పరిస్థితులను విదేశీ జాతులు.. ముఖ్యంగా బ్రిటన్‌కు చెందిన కుక్కలు తట్టుకోలేవని, ఇటువంటి జాతులు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతాయన్నారు. దేశీయ కుక్కల జాతులు క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రజలు , ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా చట్టాలు చేయాలన్నారు.
త్వరలో ‘బడ్డీ ఈజ్ నాట్ బ్యాడ్’ క్యాంపెయిన్
మన దేశంలో సుమారు 50 వరకు స్థానిక జాతుల కుక్కలు ఉండేవని, ఇందులో 36 వరకు జాతులు అంతరించిపోయాయన్నారు. ఇందులోనూ రాజ పాల్యం, ముద్హోల్ హౌండ్, కొంబై, చిప్పిపరై, రాంపూర్ హౌండ్ వంటి 12 బ్రీడ్స్అంతరించే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో కొన్ని ఇప్పటికే అరుదుగా మారాయని తెలిపారు. ఇండియన్ పరయా డాగ్ (ఇండీ డాగ్) వంటి సాధారణ వీధి కుక్కలు తెలివిగలవని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
వీధి కుక్కలకు వాక్సినేషన్ చేస్తూ, ట్రాకింగ్ చేయడం ద్వారా వాటి వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు త్వరలో ‘బడ్డీ ఈజ్ నాట్ బ్యాడ్’ పేరుతో ఒక క్యాంపెయిన్‌ను చేపట్టనున్నట్టు ప్రకటించారు. కమ్యూనిటీ సెంటర్లలో, క్యాంపస్‌లు, స్కూళ్లు ఉన్న ఏరియాల్లో కుక్కలకు వాక్సిన్ వేసి, తామే ట్రాకింగ్చేస్తూ ఉంటామన్నారు.
