
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేవాదాయశాఖ భూములను కాపాడాలని ఎండోమెంట్ అధికారులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. గతనెల 25న ఎండోమెంట్ కమిషనర్ లెటర్‌రాశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ లో శ్రీగణేశ్దేవాలయానికి 28.24 ఎకరాల భూమి ఉండేదని, ప్రస్తుతం ఆరు ఎకరాలు మాత్రమే మిగిలిందని తెలిపారు. మిగతాదంతా అన్యక్రాంతమైందని పేర్కొన్నారు. 112, 116, 125 సర్వేనంబర్ల భూములు ఆక్రమించారన్నారు.
ఈ భూములకి సంబంధించి కోర్టుల్లో కేసులున్నా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేశారని హైడ్రా కమిషనర్ కు తెలియజేశారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు కూడా ఎండోమెంట్నోటీస్లేకుండా భవన నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేశారని, ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఓపెన్ ప్లాట్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మించారన్నారు.
ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు అధికారులు ప్రస్తుత అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు అందిస్తున్నారని, అంతర్గత సీసీ రోడ్లు సైతం వేశారన్నారు. మిగిలి ఉన్న భూములను కాపాడటానికి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, అన్ని శాఖల అధికారులు అనుమతులు ఇవ్వకుండా చూడాలన్నారు. ప్రభుత్వం భూములను కాపాడుతున్న హైడ్రా ఎండోమెంట్ భూములను కూడా రక్షించాలని కోరారు.