క్వాలిటీ క్లియరెన్స్‌‌ కోసం రూ. 18 వేలు డిమాండ్‌‌

క్వాలిటీ క్లియరెన్స్‌‌ కోసం రూ. 18 వేలు డిమాండ్‌‌
  • రూ. 7 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

జగిత్యాల రూరల్, వెలుగు : క్వాలిటీ కంట్రోల్‌‌ క్లియరెన్స్‌‌ సర్టిఫికెట్‌‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఇంజినీర్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. కరీంనగర్‌‌ ఏసీబీ డీఎస్పీ విజయ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్లకు చెందిన వెంకటేశ్‌‌ అనే కాంట్రాక్టర్‌‌ గతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వాటికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్‌‌ క్లియరెన్స్‌‌ సర్టిఫికెట్‌‌ కోసం జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్‌‌ శాఖలోని విజిలెన్స్‌‌ అండ్‌‌ క్వాలిటీ కంట్రోల్‌‌ విభాగంలో పనిచేసే అసిస్టెంట్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌ అనిల్‌‌కుమార్‌‌ను కలిశాడు.

రూ.23 లక్షల విలువైన పనులకు క్వాలిటీ కంట్రోల్‌‌ క్లియరెన్స్‌‌ ఇచ్చేందుకు రూ.18 వేలు ఇవ్వాలని అనిల్‌‌కుమార్‌‌ డిమాండ్‌‌ చేయగా.. రూ. 10 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్‌‌ ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల కింద రూ. 3 వేలు ఇచ్చాడు. అనంతరం కాంట్రాక్టర్‌‌ వెంకటేశ్‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదుచేశాడు. వారి సూచన మేరకు బుధవారం ఇంజినీర్‌‌ అనిల్‌‌కుమార్‌‌ను కలిసి రూ. 7 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇంజినీర్‌‌ను రెడ్‌‌హ్యాడెండ్‌‌గా పట్టుకున్నారు.